కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భర్తపై రౌడీషీట్ ఓపెన్ చేయడానికి ఆ జిల్లా పోలీసులు సన్నద్ధం అవుతున్నారని సమాచారం. హైదరాబాద్‌లో ఆస్తి తగాదాల్లో కిడ్నాప్, అలాగే సొంత పార్టీ నేతపై కడప జిల్లాలో హత్యాయత్నం, కర్నూలు జిల్లాలో బంధువుల ఆస్తులను కాజేసే క్రమంలో రాత్రివేళ వెళ్లి యంత్రాలు, పొలాల రక్షణ గోడలు ధ్వంసం చేసిన కేసుల్లో సదరు మాజీ మంత్రి భర్తపై ఆరు కేసులు నమోదయ్యాయి.
ఇటీవల ఆళ్లగడ్డలో బీజేపీ నాయకుడి ఆస్తికి రక్షణగా నిర్మించిన గోడను ధ్వంసం చేసిన కేసులో సదరు మాజీ మంత్రి భర్తపై కేసు నమోదు కావడం, ప్రస్తుతం ఆయన పరార్‌లో ఉండడం చర్చనీయాంశమైంది. వరుసగా నేర చర్యలకు పాల్పడుతున్న సదరు టీడీపీ నాయకురాలి భర్తను కట్టడి చేస్తే తప్ప, సామాన్య ప్రజలు బతికి బట్టకట్టలేరంటూ కొందరు పోలీసులకు మొర పెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపై ఎక్కడెక్కడ, ఎలాంటి కేసులు నమోదయ్యాయో వివరాలు సేకరించారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలో నమోదైన కేసులను పరిశీలిస్తే, అన్నీ నేరమయమైనవని గుర్తించారు. నిజానికి టీడీపీ సీనియర్ మహిళా నేత విషయంలో అధికార పార్టీ ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే వారు రెచ్చిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు.
దీంతో ప్రజానీకంలో చెడ్డపేరు వచ్చిన వారి కోసం ప్రభుత్వం బద్నాం కాకూడదనే నిర్ణయానికి వైసీపీ ముఖ్యనేతలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు మహిళా నేత భర్తపై రౌడీషీట్ ఓపెన్ చేసి అతని నేరాలకు అడ్డుకట్ట వేయాలని కర్నూలు జిల్లా పోలీస్ అధికారులు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.