చినజీయర్, కేసీఆర్ మధ్య విభేదాలొచ్చాయని గ్రేట్ ఆంధ్ర ఇదివరకే చెప్పింది. అయితే అవి కేవలం అపోహలు కాదు, నిజమేనంటూ చినజీయర్ ఇచ్చిన వివరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. స్వామీజీలకు ప్రతిపక్షాలు, విపక్షాలు ఉండవంటూనే.. తమ మధ్య వచ్చిన గ్యాప్ ని కవర్ చేసే ప్రయత్నం చేశారు చినజీయర్.
శిలా ఫలకంలో పేరు లేకపోవడానికి కూడా కారణం చెప్పారు. కేసీఆర్ అనారోగ్య కారణాల వల్లే రాలేకపోయారని వివరణ ఇచ్చుకున్నారు. అన్నిటి కంటే హైలెట్ ఏంటంటే.. కేసీఆర్ టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటూ చినజీయర్ చెప్పిన ఉదాహరణలు.
మా మధ్య విభేదాలు నిజమైతే సమతా మూర్తి ప్రాంగణానికి కరెంటు సరఫరా కట్ అయ్యేది, నీటి సరఫరా ఆపేసేవారు, పోలీసు బలగాల్ని వెనక్కి పిలిపించుకునేవారు.. ఇలా సిచ్యుయేషన్స్ ని చెప్పి మరీ వివరణ ఇచ్చారు చినజీయర్. అలాంటివేవీ జరగలేదు కాబట్టి.. తమకి, కేసీఆర్ కి మధ్య విభేదాలు లేవు అనుకోండి అన్నారు.
అంటే నిజంగా కేసీఆర్ టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని పరోక్షంగా వివరించారు చినజీయర్. ఎంత వైరం ఉన్నా ఎవరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కరెంటు కట్ చేయరు, నీటి సరఫరా ఆపరు, పోలీసు బలగాలను వెనక్కి తీసుకోరు. సో.. కేసీఆర్ బలహీనతలను బేస్ చేసుకునే చినజీయర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
శాంతి కల్యాణం కోసం పరోక్ష ఒత్తిడి తెస్తున్నారా..?
మీడియాని రాజకీయనాయకులే లైట్ తీసుకుంటున్నారు. అందులోనూ కేసీఆర్ కూడా ఈ వివాదంపై స్పందించలేదు. అలాంటిది చినజీయర్ ఇంత త్వరగా స్పందించారంటే దాని వెనక ఏదో కారణం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతానికి తమ మధ్య ఏదీ లేదని చెబుతూనే.. శాంతి కల్యాణం కోసం కేసీఆర్ వస్తే బాగుంటుందని, ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టినట్టవుతుందని పరోక్షంగా సూచిస్తున్నారు చినజీయర్. ఇంత జరిగాక ఇంకా కేసీఆర్ ముచ్చింతల్ వెళ్తారని ఎవరూ అనుకోరు. ఒకవేళ వెళ్లారంటే మాత్రం ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో తొలి అడుగు వేసినట్టే.