బీజేపీ ఎక్క‌డా ఇంత ప్ర‌చారం చేయ‌లేదు!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార హోరు ముగిసింది. ఈ రోజు ప్ర‌చారానికి పూర్తి విరామం కాగా, రేపు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. వ‌చ్చే ఆదివారం క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డి కానుంది. పోలింగ్ పూర్త‌యిన…

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార హోరు ముగిసింది. ఈ రోజు ప్ర‌చారానికి పూర్తి విరామం కాగా, రేపు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. వ‌చ్చే ఆదివారం క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డి కానుంది. పోలింగ్ పూర్త‌యిన మూడో రోజే ఫ‌లితాలు రానుండ‌టం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా ఫ‌లితాల కోసం వారం రోజుల వ్య‌వ‌ధి అయినా వేచి చూసే ప‌రిస్థితి ఉంటుంది. అయితే క‌ర్ణాట‌క ఫ‌లితాలు ఈవీఎంల‌లో ఎక్కువ సేపు దాగ‌డం లేదు. కేవ‌లం 48 గంట‌లు పూర్త‌యిన వెంట‌నే కౌంటింగ్ ప్రారంభం కానుంది.

ఇక ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాజ‌కీయ పార్టీలు అమీతుమీ త‌ల‌ప‌డ్డాయి. ఎటుతిరిగీ ఈ సారి అధికారాన్ని నిల‌బెట్టుకోవాల్సిందే అనే ప‌ట్టులో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌చారం విష‌యంలో ప‌తాక స్థాయికి వెళ్లింది. ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు నుంచినే బీజేపీ ప్ర‌చారాన్ని హోరెత్తించింది. ప్ర‌త్యేకించి ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు క‌ర్ణాట‌క చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తూ ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా రాక‌ముందే ఇక్క‌డ రాజ‌కీయ వేడిని రేకెత్తించారు.

మొత్తం ప్ర‌చార ప‌ర్వంలో కూడా బీజేపీదే పై చేయి కావ‌డం గ‌మ‌నార్హం. క‌మ‌లం పార్టీ నేత‌ల అధికారిక స‌మాచారం ప్ర‌కార‌మే… ప్ర‌ధానితో స‌హా 15 మంది కేంద్ర మంత్రులు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. క‌మ‌లం పార్టీకి సంబంధించి 125 మంది నేష‌న‌ల్ లీడ‌ర్లు ఈ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హోరెత్తించారు.

బీజేపీ ఏకంగా 3,116 ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీల‌ను నిర్వ‌హించింది. 9125 ప‌బ్లిక్ మీటింగ్స్ ను నిర్వ‌హించారు క‌మ‌లం పార్టీ నేత‌లు! 1377 రోడ్ షోలు, ఇంకా 9077 స్ట్రీట్ కార్న‌ర్ మీటింగులు అద‌నం! ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా 26 ర్యాలీల్లో నిర్వ‌హించారు. వీటిలో లాంగెస్ట్ రోడ్ ర్యాలీ బెంగ‌ళూరులో నిర్వ‌హించారు. ఏకంగా 26 కిలోమీట‌ర్ల మేర మోడీ ర్యాలీ జ‌రిగింది!

అమిత్ షా ర్యాలీలు, స‌భా కార్య‌క్ర‌మాలు క‌లిపి ఏకంగా 31 చోట్ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌సంగించారు. అంత‌ర్గ‌త వ్యూహాల్లో క్రియాశీల‌కంగా, అంతా తాన‌య్యే అమిత్ షా ఇలా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని అత్య‌ధిక ప్ర‌సంగాలు చేసిన నేత కావ‌డం గ‌మ‌నార్హం!

జేపీ న‌డ్డా ప‌ది ర్యాలీలు, 16 రోడ్ షోలు నిర్వ‌హించార‌ట‌. ఇక ఏకంగా 15 రాష్ట్రాల సీఎంలు వ‌చ్చి క‌ర్ణాట‌క‌లో బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. వీరంతా బీజేపీ సీఎంలే, శివ‌సేన సీఎం అయిన ఏక్ నాథ్ షిండే కూడా క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప్ర‌చారంలో పాల్గొన్నారు.

ఇవ‌న్నీ గాక.. ప‌ది ప‌దిహేను మోట‌ర్ బైకుల‌పై ఔత్సాహికుల‌తో రోడ్డు ర్యాలీల‌ను నిర్వ‌హించింది బీజేపీ. స్థానిక యువ‌త‌ను ఇందుకోసం ఉప‌యోగించుకుంది. గంట‌గంట‌కూ ఇలాంటి ర్యాలీ ఏదో ఒక‌టి సాగేలా చూసుకుంది. వందేమాత‌రం, బీజేపీ జిందాబాద్ అంటూ.. హోరెత్తించింది. దేశ‌భ‌క్తిని, పార్టీ భ‌క్తిని ఇలా క‌ల‌గ‌లిపి ఎమోష‌న్ ను రేకెత్తించేందుకు క‌మ‌లం పార్టీ శ‌త‌థా ప్ర‌య‌త్నించింది. 

బీజేపీ ప్రచారంతో పోలిస్తే .. కాంగ్రెస్, జేడీఎస్ లు ప్ర‌చారంలో చాలా  చాలా వెనుక‌బ‌డ్డాయి. కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడ‌ర్లు గ‌ట్టిగానే ప్ర‌చారం చేసినా, రాహుల్, ప్రియాంక‌ల ప్ర‌చారం ఏదో మొక్కుబ‌డిగా సాగింది. క‌ర్ణాట‌క‌లో కొద్దోగొప్పో అవ‌కాశం ఉంద‌ని తెలిసినా.. మోడీ, షాల‌తో పోలిస్తే రాహుల్, ప్రియాంక‌ల క‌ష్టం చాలా నామ‌మాత్రం. 

మోడీ, షాలు అన్నీ ప‌క్క‌న పెట్టేసి నెల రోజుల నుంచి కేవ‌లం క‌ర్ణాట‌క మీదే కాన్స‌న్ ట్రేట్ చేశారు. రాహుల్, ప్రియాంక‌లకు ఇంత శ్ర‌ద్ధ కానీ, ల‌క్ష్యం కొద్దీ ప‌ని చేయ‌డం కానీ అంత సీన్ లేద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి ఇంత‌కీ క‌ర్ణాట‌క ఓట‌ర్ ఎటువైపో! మ‌రో ఐదు రోజుల్లో తేలిపోనుంది!