శవాలపై పేలాలు ఏరడంలో చంద్రబాబు నెంబర్ వన్!

అకాల వర్షాలు రైతులను బాగా దెబ్బతీశాయి. ఏకంగా పంటలు మునిగిపోయి మొత్తం నష్టపోయిన రైతులు అనేకులు. పొలాల్లోనే పంటను వదిలేసుకున్న వారి బాధ ఒక ఎత్తు అయితే.. కోతలు కోసి నూర్పిళ్లు చేసి పంటను…

అకాల వర్షాలు రైతులను బాగా దెబ్బతీశాయి. ఏకంగా పంటలు మునిగిపోయి మొత్తం నష్టపోయిన రైతులు అనేకులు. పొలాల్లోనే పంటను వదిలేసుకున్న వారి బాధ ఒక ఎత్తు అయితే.. కోతలు కోసి నూర్పిళ్లు చేసి పంటను కళ్లాల్లో ఉంచిన వారి కన్నీళ్లు ఇంకో ఎత్తు. 

రైతులు ఏ రకంగా నష్టపోయినా సరే వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చేయదగిన అన్ని పనులూ చేస్తోంది. తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. పొల్లాల్లో పంటను కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం సాయం అందిస్తోంది.

ఇదంతా ఒకవైపు నడుస్తుండగా.. చంద్రబాబునాయుడు మాత్రం రైతులకు వచ్చిన కష్టాలను ఎజెండాగా చేసుకుని ప్రభుత్వం మీద బురద చల్లడానికి నానా పాట్లు పడుతున్నారు. వర్షాలు నష్టం కలిగించిన మొదటి రోజునుంచి చంద్రబాబు.. తన విషప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వం సాయం చెయ్యడం లేదని బురదచల్లడం మొదలెట్టారు. 

మొదటిరోజునే నష్టపోయిన ప్రాంతాల్లో వాలిపోయిన ఈ పద్నాలుగేళ్ల సీనియారిటీగల ముఖ్యమంత్రి.. అధికారులు సాయం అందించడానికి అంచనాలు తయారు చేయడానికి ఒకటిరెండు రోజుల వ్యవది పడుతుందనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా మాట్లాడారు. ఈలోగా ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించింది. తన పర్యటనలు చూసి భయపడి కొంటున్నారని డబ్బా కొట్టుకున్నారు చంద్రబాబు. 

ఇప్పుడు మళ్లీ రైతులతో ఓ పెద్ద సభ, పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారు. వర్షం వల్ల కలిగిన నష్టానికి సంబంధించి.. కోతలు పూర్తిచేసిన వారికి, చేయని వారికి అందరికీ కూడా ప్రభుత్వం అన్ని రకాల సాయమూ అందిస్తున్నప్పటికీ.. చంద్రబాబు ఈ విషయంలో బురద చల్లుతూనే ఉన్నారు. చూడబోతే.. ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వాటిల్లుతుందా? ఏ విపత్తు ముంచుకు వస్తుందా? ప్రభుత్వం ఏమీ చేయడం లేదు.. అనే నిందలు వేయడానికి రెడీగా ఉందామా అని చంద్రబాబు ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. 

రైతులతో పాదయాత్ర అనే ముసుగులో పార్టీ పాదయాత్రనే ఆయన నిర్వహిస్తారన్నది అందరికీ తెలిసిన సంగతి. అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో కిరాయి కూలీలను అరసవిల్లి దాకా నడిపించే ప్రయత్నం… పోలీసులు ఆధార్ లుచూపించమని అడగ్గానే ఎలా ఫెయిలయిందో అందరికీ తెలుసు. 

నష్టపోయిన రైతులతో పాదయాత్ర వ్యవహారం కూడా అలాగే ఉంటుందని, చంద్రబాబు వ్యవహారం శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్టుగా కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.