మోడీ మ్యాజిక్ కు ఇది సెమీఫైన‌ల్!

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్ని చేసి, ప‌దివేల‌కు పైగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లు, ర్యాలీలు, రోడ్ షోల‌ను నిర్వ‌హించినా.. ఆ పార్టీ ఆశ‌ల‌న్నీ ఒక్క ప‌దం మీదే ఆధార‌ప‌డి ఉన్నాయి.…

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్ని చేసి, ప‌దివేల‌కు పైగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లు, ర్యాలీలు, రోడ్ షోల‌ను నిర్వ‌హించినా.. ఆ పార్టీ ఆశ‌ల‌న్నీ ఒక్క ప‌దం మీదే ఆధార‌ప‌డి ఉన్నాయి. అదే *మోడీ మ్యాజిక్*. ఇది వ‌ర్కవుట్ అయితేనే బీజేపీ క‌ర్ణాట‌క‌లో గెలిచి నిలుస్తుంది. క‌ర్ణాట‌క‌లో ఈ సారి బీజేపీ గెల‌వ‌లేదంటే మాత్రం *మోడీ మ్యాజిక్* కు కాలం చెల్లుతున్న‌ట్టే!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించుకోలేదు. క‌నీసం ఇప్పుడున్న ముఖ్య‌మంత్రినే మ‌ళ్లీ సీఎంగా చేస్తామ‌ని కూడా చెప్ప‌లేదు. స‌ద‌రు ముఖ్య‌మంత్రే.. క‌నీసం అధిష్టానం త‌న‌కు మ‌రో చాన్స్ ఇస్తుంద‌నే ఆశాభావాన్ని కూడా వ్య‌క్తం చేయ‌లేక‌పోయారు! ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఏ ఒక్క చోటా ఆయ‌న ఈ మాట ఆశాభావం అనే రీతిలో కూడా వ్య‌క్తం చేయ‌లేదు. క‌నీసం త‌న కోరిక‌ను కూడా ఆయ‌న వ్య‌క్తం చేసుకోలేక‌పోయారు పాపం! భార‌తీయ జ‌న‌తా పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఈ స్థాయిలో ఉందిప్పుడు. ముఖ్య‌మంత్రి హోదాలోని వ్య‌క్తి ప‌రిస్థితి అది!

ఏం మాట్లాడితే అధిష్టానానికి ఏం కోసం వ‌స్తుందో అన్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌చారం చేసుకుంటూ పోయారు. ఒక‌వేళ బీజేపీ ఓడినా బొమ్మైకి పోయేదీ కేవ‌లం ప‌ద‌వే త‌ప్ప అంత‌కు మించి ఏమీ లేక‌పోవ‌చ్చు. సాధార‌ణంగా ఎక్క‌డైనా యాంటీ ఇంక‌బెన్సీ అంటూ ముఖ్య‌మంత్రిని నిందించే పరిస్థితి ఉంటుంది. క‌ర్ణాట‌క‌లోనూ ఇదే జ‌రుగుతూ ఉంది. బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త అంటోంది మీడియా. అయితే గెలిచినా, ఓడినా అది మోడీ మ్యాజిక్ మీదే జ‌ర‌గ‌బోతోంద‌ని కూడా మీడియానే స్ప‌ష్టం చేస్తోంది.

మోడీని చూసి.. ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా అది బొమ్మై అయినా, బొమ్మ అయినా క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు యాక్సెప్ట్ చేసే ప‌రిస్థితి ఉండాలి. లేదా మోడీ మ్యాజిక్ ముగిసిపోయి.. క‌ర్ణాట‌క‌లో బీజేపీని ప్ర‌జ‌లు ఏ 70, 80 సీట్ల‌కో ప‌రిమితం చేయాలి! 

ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా రాష్ట్రాల్లో బీజేపీ కేవ‌లం మోడీ మ్యాజిక్ మీద ఆశ‌ల‌తోనే ప‌ని చేసింది. చాలా రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ్వ‌రో చెప్ప‌కుండా మోడీని చూసి ఓటేయ‌మ‌ని పిలుపునిచ్చింది. మోడీ త‌ప్ప మ‌రో మాట అన‌వ‌స‌రం అంది. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లోనూ అదే జ‌రుగుతోంది. అయితే ఇది స‌రిగ్గా లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది స‌మ‌యం ఉన్నంత‌లో కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అది కూడా క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఇన్నేళ్లూ యడియూర‌ప్ప వంటి బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గ నేప‌థ్యం ఉన్న నేత నాయ‌క‌త్వంలోనే ప‌ని చేసింది. య‌డియూర‌ప్ప బీజేపీని వీడిన‌ప్పుడు క‌మ‌లం పార్టీ అస‌లు బ‌లం తేలిపోయింది కూడా! 

ఇలా నాయ‌కుల వ్య‌క్తిగ‌త చ‌రిష్మా ప‌ని చేస్తుంద‌నుకున్న చోట‌.. స‌ద‌రు నేత‌ను తెర‌వెన‌క్కు పంపించి మ‌రీ మోడీ మ్యాజిక్ కు మోడీనే ప‌రీక్ష పెట్టుకున్నారు. ఏకంగా 26 ఎన్నిక‌ల ర్యాలీలు నిర్వ‌హించారు. గుళ్లూ, గోపురాలు, మ‌ఠాలు, మ‌ఠాధిప‌తులు.. ఇలాంటి రాజ‌కీయ‌మే సాగింది. ఆఖ‌రికి ది కేర‌ళ స్టోరీ అనే సినిమాను కూడా మోడీ త‌న ప్ర‌సంగంలో వాడేశారు. ఏ ఒక్క అంశాన్నీ వ‌ద‌ల‌కుండా.. అచ్చంగా క‌ర్ణాట‌క‌లో బీజేపీ వీర భ‌క్తులు ఎలా మాట్లాడ‌తారో, మోడీ కూడా టీ కొట్టు స్థాయి అంశాల‌న్నింటినీ మాట్లాడేశారు. 

ఎంతైనా త‌ను టీ అమ్మిన‌ట్టుగా మోడీ చెప్పుకుంటారు. మోడీ ఎన్నిక‌ల ప్ర‌సంగాల్లో కూడా టీ కొట్టు స్థాయి అంశాలు హైలెట్ అయ్యాయి. ఎలాగైతేనేం.. మోడీ మ్యాజిక్ కు ఆయ‌నే ప‌రీక్ష, అది కూడా పెద్ద ప‌రీక్ష పెట్టుకున్నారు. మ‌రి దేశ‌ ప్ర‌జ‌ల్లో మోడీ మాట‌ల ప‌ట్ల ఆద‌ర‌ణ ఎంత‌.. అనే అంశంపై క‌న్న‌డీగులు ఒక శాంపిల్ ను వెల్ల‌డించ‌నున్నారు. 

క‌ర్ణాట‌క‌ను బీజేపీ వాళ్లు ఎంత యూపీగా మార్చినా.. ఎంత మ‌త‌రాజ‌కీయాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లినా, క‌ర్ణాట‌క ద‌క్షిణాది రాష్ట్ర‌మే! మ‌రి తొమ్మిదేళ్లానంత‌రం మరో ఏడాదిలో మూడో సారి లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను మోడీ ఎదుర్కొనాల్సిన త‌రుణంలో ఇప్పుడు ఆయ‌న మ్యాజిక్ ప‌ని చేస్తే.. 2024లో కూడా కేంద్రంలో బీజేపీ తిరుగులేని రీతిన అధికారాన్ని చేప‌ట్ట‌డం లాంఛ‌న‌మే. క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఓడితే మాత్రం.. ఇది కాస్తంత ఆలోచించాల్సిన అంశ‌మే!