‘జగనన్నకు చెబుదాం’… ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే!

ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. స‌మ‌స్య‌ల గురించి అడిగితే క‌థ‌లుక‌థ‌లుగా చెప్ప‌డానికి జ‌నం సిద్ధంగా ఉన్నారు. అయితే వినే అధికారులు, పాల‌కులే క‌రువ‌య్యారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అంటూ ప్ర‌భుత్వం ప‌లు వేదిక‌లు ఏర్పాటు…

ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. స‌మ‌స్య‌ల గురించి అడిగితే క‌థ‌లుక‌థ‌లుగా చెప్ప‌డానికి జ‌నం సిద్ధంగా ఉన్నారు. అయితే వినే అధికారులు, పాల‌కులే క‌రువ‌య్యారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అంటూ ప్ర‌భుత్వం ప‌లు వేదిక‌లు ఏర్పాటు చేసింది. అయితే అందులో చాలా త‌క్క‌వ వాటికి మాత్ర‌మే ప‌రిష్కారం దొరుకుతోంది. ఇప్పుడు కొత్త‌గా ‘జగనన్నకు చెబుదాం’ అంటూ కొత్త కార్య‌క్ర‌మానికి సీఎం శ్రీ‌కాం చుట్ట‌డం ప్ర‌శంస‌నీయం.

ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోడానికి 1902 అనే టోల్ ఫ్రీ నంబ‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇంత వ‌ర‌కూ అంతా బాగుంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా గ‌తంలో ఇలాంటి ప్ర‌యోగాలు చేసింది. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తోంద‌ని చూపుకోడానికి, చెప్పుకోడానికి పాల‌కులు ఏవో తంటాలు ప‌డుతుంటారు. అలాంటి కార్య‌క్ర‌మంలో ఒక‌టిగా ‘జగనన్నకు చెబుదాం’  అనేది చేరితో మాత్రం వైసీపీకి న‌ష్ట‌మే.  

ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యాన్ని గ‌మ‌నిస్తే…సంక్షేమ పథకాలు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయవచ్చు. అలాగే రెవెన్యూ  సమస్యలపై కూడా సీఎం జ‌గ‌న్‌కు మొర‌పెట్టుకోవ‌చ్చు.  

అయితే ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలంటే ప్ర‌భుత్వం కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు వెళ్లే కాల్స్‌ను రిసీవ్ చేసుకునే వారికి సంబంధిత స‌బ్జెక్టుల్లో అవ‌గాహ‌న ఉండాలి.

ముఖ్యంగా వినే ఓపిక ఉండాలి. ఇది ఒక ఉద్యోగంగా కాకుండా, సేవా కార్య‌క్ర‌మంగా భావించి ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌ని చేయాలి. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోతే, ప‌దేప‌దే అదే అంశంపై కాల్స్ వ‌స్తున్నాయ‌నే అస‌హ‌నానికి గురి కాకూడ‌దు. టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌నే భ‌రోసా క‌ల్పించేలా వ్య‌వ‌హ‌రించాలి.