టికెట్లు అమ్ముకునే సీజన్ ఎప్పుడు?

రాజకీయాల్లో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోవడానికి ఒక నిర్దిష్టమైన సీజన్ ఉంటుందా? అంటే అవుననే చెప్పాలి. అమ్ముకునే అలవాటు లేదా ఆలోచన ఉండేవాళ్లు.. అభ్యర్థుల జాబితాలను ప్రకటించడానికి ముందే ఆ వ్యాపారం ముగించాలి. కానీ.. తెలంగాణ…

రాజకీయాల్లో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోవడానికి ఒక నిర్దిష్టమైన సీజన్ ఉంటుందా? అంటే అవుననే చెప్పాలి. అమ్ముకునే అలవాటు లేదా ఆలోచన ఉండేవాళ్లు.. అభ్యర్థుల జాబితాలను ప్రకటించడానికి ముందే ఆ వ్యాపారం ముగించాలి. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల్లో ఒకరైన షబ్బీర్ ఆలీ మాత్రం చిత్రంగా మాట్లాడుతున్నారు.

కాంగ్రెసు పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారంటూ.. ఇటీవలి కాలంలో ఆరోపణలు ముమ్మరంగా వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలే నిత్యం ఏదో ఒక వివాదంతో సతమతం అవుతూ ఉండే కాంగ్రెసు పార్టీని.. ఈ దఫా టికెట్ల అమ్మకాల గురించిన విమర్శలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అండగా షబ్బీర్ ఆలీ తన గళం వినిపిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలొ ఇంకా ఎవరికీ టికెట్లు ఖరారు కాలేదు గనుక, అభ్యర్థుల జాబితాలు ఇంకా విడుదల కాలేదు గనుక.. ఇలాంటి ఆరోపణల్లో అర్థం లేదని ఆయన అంటున్నారు. టికెట్లు ఖరారుకాకుండానే.. అమ్ముకోవడం ఎలా సాధ్యం అనేది ఆలీ వాదన.

అయితే తమాషా ఏంటంటే.. టికెట్లు ఎవరికి దక్కబోతున్నాయో ఖరారు అయ్యాక ఇక అమ్ముకోడానికి ఏముంటుంది? ఖరారు కావడానికి ముందు, జాబితాలు విడుదల కాక ముందే.. అయితే గియితే.. ఆశావహులను ఊరించే మాటలు చెప్పి.. వారినుంచి తృణమో పణమో పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ లాజిక్ ను షబ్బీర్ ఆలీ మిస్సవుతున్నారు. ప్రస్తుతం వారు అమ్ముతున్నారని కాదు గానీ, అమ్మకాలకు సంబంధించిన ఆరోపణలు మాత్రం రైట్ టైమ్ లోనే వచ్చాయనే సంగతిని ఆయన గుర్తించాలి.

అయినా ఈదఫా కాంగ్రెసు పార్టీ టికెట్ల అమ్మకం వంటి సాహసానికి దిగుతుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు గనుక చావోరేవో తేల్చుకుని ఎన్నికల్లో విజయం సాధించకపోతే గనుక.. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్తు అత్యంత దయనీయంగా తయారైపోతుందనే భయం వారికి ఉంది. అందుకే తెగించి పోరాడుతున్నారు. 

తెలంగాణ ఎన్నికల మీద సర్వశక్తులూ ఒడ్డి ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ముఠాలకు మారుపేరు అయిన కాంగ్రెసులో వర్గవిభేదాలను పక్కన పెట్టి పనిచేస్తున్నారంటేనే.. మారుతున్న వైఖరికి నిదర్శనం. అలాంటి నేపథ్యంలో ఆరోపణలు వస్తుండవచ్చు గానీ.. టికెట్ల అమ్మకాలు అంత ఈజీకాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.