ఆ స్ఫూర్తి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌ర్తించ‌దా?

అత్యున్న‌త స్థాయి నుంచి సామాన్య భ‌క్తుల వ‌ర‌కూ ఒకే ర‌క‌మైన ఆహారం అందించాల‌ని టీడీపీ పాల‌క మండ‌లి తీసుకున్న తాజా నిర్ణ‌యం అభినంద‌న‌లు అందుకుంటోంది. ఇదే సంద‌ర్భంలో ద‌ర్శ‌నాల విష‌యంలో కూడా ఇదే స్ఫూర్తితో…

అత్యున్న‌త స్థాయి నుంచి సామాన్య భ‌క్తుల వ‌ర‌కూ ఒకే ర‌క‌మైన ఆహారం అందించాల‌ని టీడీపీ పాల‌క మండ‌లి తీసుకున్న తాజా నిర్ణ‌యం అభినంద‌న‌లు అందుకుంటోంది. ఇదే సంద‌ర్భంలో ద‌ర్శ‌నాల విష‌యంలో కూడా ఇదే స్ఫూర్తితో మ‌రో అద్భుత నిర్ణ‌యం తీసుకోవాల‌ని క‌లియుగ దైవం శ్రీ‌వారి భ‌క్తుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తిరుమ‌ల‌లో హోట‌ళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు తొల‌గించి, ముఖ్య‌మైన సెంట‌ర్ల‌లో ఉచితంగా అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేయాల‌ని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాల‌క మండలి నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

అత్యున్నత స్థాయి నుంచి సామాన్య భక్తుల వరకూ ఒకే రకమైన ఆహారం అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టే, ఒకే ర‌క‌మైన ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పౌర స‌మాజం కోరుతోంది. త‌ద్వారా భగ‌వంతుని దృష్టిలో అంద‌రూ స‌మానులే అనే గొప్ప సందేశాన్ని తీసుకెళ్లిన ఘ‌న‌త వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాల‌క మండ‌లికి ద‌క్కుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

వీవీఐపీలు, వీఐపీల పేర్ల‌తో క‌లియుగ దైవం ముందు భ‌క్తుల‌ను విభజించి, ద‌ర్శ‌నం విష‌యంలో వివ‌క్ష‌ణ ప్ర‌ద‌ర్శిస్తుండం ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతోంది. ప్ర‌ముఖులు ద‌ర్శ‌నానికి వ‌స్తే , గంట‌ల త‌ర‌బ‌డి భ‌క్తుల‌కు గ‌దుల్లోనో లేదా క్యూల‌లో బంధిస్తుండ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఒక్కోసారి ద‌ర్శ‌నం విష‌యంలో విప‌రీత‌మైన జాప్యాన్ని నిర‌సిస్తూ భ‌క్తులు క్యూలైన్ల‌లో నిర‌స‌న‌కు దిగ‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో హోట‌ళ్లు, ఫాస్టు ఫుడ్ సెంట‌ర్ల‌ను మూసివేయ‌డం వ‌ర‌కే ప‌రిమితం కాకుండా, సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం విష‌యంలో ప్రాధాన్యం ఇస్తేనే, టీటీడీ చ‌ర్య‌ల‌కు గౌర‌వం ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను పున‌రుద్ధరించాలని టీటీడీ పాల‌క మండ‌లి నిర్ణ‌యించ‌డం గ‌మనార్హం. కేవ‌లం టీటీడీనే వ్యాపారం చేసుకోవాల‌నే ధోర‌ణి వైసీపీ ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది.  

ఒక వైపు హుండీ ద్వారా రూ. వెయ్యి కోట్లు, పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ. 668.51 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.365 కోట్లు, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.242 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.126 కోట్లు, ఆర్జితసేవలతో రూ.120 కోట్లు, అద్దె గదులు, కల్యాణ మండపాల ద్వారా రూ.95 కోట్లు, కాటేజీ డోనర్‌ స్కీం కింద రూ.90 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

సామాన్య భ‌క్తుల‌పై భారం ప‌డ‌కుండా, వారికి ద‌ర్శ‌న సౌక‌ర్యం మ‌రింత సుల‌భ‌త‌రం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త పాల‌క మండలిపై ఉంది. అలా కాకుండా రాజ‌కీయ‌, సినీ, వ్యాపార పెద్ద‌ల సేవ‌ల‌కే ప‌రిమిత‌మైతే మాత్రం పాలక పార్టీ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది.