గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఇవాళ నిర్వహించే సమావేశానికి రావాలని టీడీపీ అధిష్టానం ఆహ్వానం పంపింది. చంద్రబాబుతో నిర్వహించే సమావేశానికి గంటాతో పాటు మరో 11 మందికి ఆహ్వానం అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాలకప్రతిపక్ష పార్టీల రాజకీయ పంథాపై చర్చకు తెరలేచింది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ రాజకీయ పంథా మధ్య స్పష్టమైన తేడా వుంది. టీడీపీకి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. టీడీపీ ప్రధాన ప్రత్యర్థి వైసీపీకి 12 ఏళ్ల చరిత్ర ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ నడుస్తోంది. సీఎం కావాలనే చిరకాల ఆకాంక్షను దశాబ్ద కాలం పోరాటం తర్వాత జగన్ నెరవేర్చుకున్నారు.
ఇదే చంద్రబాబు విషయం వేరు. ఆయనకు సీఎం పదవి దక్కిన వైనం అందరికీ తెలిసిందే. దాన్ని కాపాడుకోవడం చంద్రబాబు చాణక్య నీతికి నిదర్శనం. ఇదిలా వుండగా పార్టీలను నడపడంలో చంద్రబాబు, జగన్ పంథాలు భిన్నంగా ఉన్నాయి. ఎవరైనా పార్టీలో ఏదైనా కారణంతో అలకవహిస్తే చంద్రబాబు ఓదార్చి దగ్గరికి తీసుకుంటారు. ఇదే జగన్ విషయానికి వస్తే… అసలు పట్టించుకోరు. వుంటే ఉండని, లేకపోతే పోనీ అనే ధోరణితో వ్యవహరిస్తారని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి.
ఉదాహరణకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయన పట్ల పార్టీ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. గోరంట్ల వద్దకు పార్టీ ప్రతినిధు లను పంపి చర్చించడంతో పాటు ఆయన్ను అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లేలా చేశారు. ఒక దశలో పార్టీని వీడుతారనే ప్రచారం జరిగింది. కానీ అధినేత పిలుపించుకుని బుజ్జగించడంతో అన్నీ చక్కబడ్డాయి. ప్రస్తుతం ఆయన పార్టీలోనే కొనసాగుతూ జగన్ ప్రభుత్వంపై యధాప్రకారం విమర్శలు గుప్పిస్తున్నారు.
అధికారం పోయిన తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ, ఆయన్ను సమావేశానికి ఆహ్వానించడం కేవలం టీడీపీకే సాధ్యం. ముందే వేరే షెడ్యూల్ ఉండడంతో సమావేశానికి రాలేనని, మరోరోజు వెళ్లి చంద్రబాబును కలుస్తానని గంటా శ్రీనివాసరావు టీడీపీ అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. ఇదే అధికార పార్టీ విషయానికి వస్తే… పార్టీ లేదా ప్రభుత్వంపై ఒకవేళ వ్యతిరేక అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తే, వారిపై ఎదురు దాడికి దిగడం వైసీపీ ప్రత్యేకత. వాళ్లను పిలిపించి మాట్లాడ్డం అనేది జరగదు.
ఇక జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల ముఖాలు చూసేందుకు కూడా ఇష్టపడరు. ఎంపీ రఘురామకృష్ణంరాజు, తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఇంకా మరికొందరి గురించి వైసీపీ శ్రేణులు ఉదాహరణలు చెబుతున్నాయి. పిలిచి మాట్లాడడం ద్వారా చాలా వరకూ సమస్యలు, అపోహలు తొలగిపోతాయని టీడీపీ సిద్ధాంతం. ఇదే ముఖ్యమంత్రి పార్టీ విషయానికి వస్తే… జగన్ సిద్ధాంతమే వైసీపీ సిద్ధాంతం.