ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన మార్పు కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని ఇంత కాలం అందూ భావిస్తూ వచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను జగన్ బద్దలు కొట్టారు. పంచాయతీ, పరిషత్, ఆ తర్వాత జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో కంచుకోటకు బీటలు పడ్డాయని చంద్రబాబు మేల్కొన్నారు.
ఒక వైపు కుప్పంలో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ విమర్శించినా, క్షేత్రస్థాయిలో పార్టీ డ్యామేజీ అయిందని చంద్రబాబు గ్రహించారు. దీంతో కుప్పంలో టీడీపీలో ప్రక్షాళన చేపట్టారు. నెల లేదా రెండు నెలలకు ఒకమారు తాను వస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. పార్టీని, తన ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు దిగిరాక తప్పలేదు.
మార్చి మొదటి వారంలో కుప్పంలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మండలాల వారీగా నాయకులతో చర్చిస్తున్నారు. మార్చి మొదటి వారంలో నాలుగు మండలాల్లో గ్రామ పర్యటనలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
జనవరిలో రెండో వారంలో ఆయన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ దఫా పర్యటనలో ప్రజలు, పార్టీ శ్రేణులతో సమస్యలపై చర్చించనున్నారు. ఒకప్పుడు ఏడాదికో, రెండేళ్లకో కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, ఇప్పుడు పార్టీ బలహీనపడిన పరిస్థితితో పూర్తిగా తనను తాను మార్చుకోవాల్సి వచ్చింది.