మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ.. ఏ పార్టీలో ఉన్నా గెలుపుగుర్రమే. జిల్లాలో ఆనం కుటుంబానికి ఉన్న పేరు, స్థానికంగా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన ఏ నియోజకవర్గం ఎంపిక చేసుకున్నా ఓటర్ల ఆశీర్వాదం అందేలా చేస్తుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు కానీ, ఆ తర్వాత అలాంటి సాహసం చేయలేదు. వెంటనే పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు, పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా ఉండటంతో 2019 ఎన్నికల ముందు జగన్ జట్టులో చేరారు. మళ్లీ ఇప్పుడు ఇక్కడ రచ్చ మొదలు పెట్టారు.
జిల్లాల విభజన సహేతుకంగా లేదంటూ నేరుగా జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. స్థానిక నాయకులతో కలసి నిరాహార దీక్షల్లో కూడా పాల్గొంటున్నారు. మూడు మండలాలను బాలాజీ జిల్లాకు పోకుండా.. నెల్లూరులోనే ఉంచాలని పట్టుబడుతున్నారు. అది కుదరకపోతే తాడోపేడో తేల్చుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.
ఆనంలో అంత ధైర్యం ఏంటి..?
ఆనం తెగించేశారు, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మూడు మంత్రి వర్గాల్లో పనిచేసిన ఆనంకు జగన్ కేబినెట్ లో చోటు దక్కకపోవడమే తొలి దెబ్బ. రెండో టీమ్ లో కూడా ఆనంకు అవకాశం లేదని అంటున్నారు. ఇటీవల తమ పార్టీ నేతలపైనే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు, తాజాగా జిల్లాల విభజనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా చేయలేనంత సాహసం చేశారు.
నియోజకవర్గంలో నిరాహార దీక్షలు మొదలు పెట్టారు. స్వపక్షంలో విపక్షంలా మారి నస పెడుతున్నారు. పార్టీ తనను బయటకు పంపించినా, తనకు తాను బయటకొచ్చినా.. వచ్చే ఎన్నికల కోసం మాత్రం ఇప్పటినుంచే ఆనం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లలో భారీగా కోతపడింది, ఇళ్ల స్థలాల ఊసు కూడా లేదు. అలాంటిది ఆనం వెంకటగిరి నియోజకవర్గంలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చిన్నా పెద్దా అన్ని పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం తరపున ప్లాట్లు ఇప్పిస్తున్నారు. ఒకరకంగా ఏపీలో ఏ ఎమ్మెల్యే చేయలేని పని తమ ఎమ్మెల్యే చేశారంటూ ఆ నియోజకవర్గ జర్నలిస్ట్ లు సంబరపడిపోతున్నారు. అంతే కాదు, స్థానికంగా తన వర్గాన్ని పూర్తిగా బలపరుచుకుంటున్నారు. పార్టీకి సంబంధం లేకుండా తన వెంట నడిచే సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
2019కి పరిణామాలు ఎలా ఉన్నా.. ఏ పార్టీ టికెట్ పై పోటీ చేసినా, తన గెలుపుకి ఢోకా లేకుండా ఇప్పటినుంచే ఆనం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందుకే 3 మండలాల ప్రజల్ని ఆత్మగౌరవం అంటూ రెచ్చగొట్టి నిరాహార దీక్షలకు కూర్చోబెట్టారు. మొత్తానికి ఆనం మాత్రం యుద్ధానికి సై అంటున్నారు, మరి జగన్ నుంచి ఎలాంటి సిగ్నల్ వస్తుందో చూడాలి.