టీటీడీ తీసుకున్న అద్భుతమైన నిర్ణయం!

తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం గురువారం నాటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తిరుమల గిరుల్లో భక్తులు అందరికీ కూడా శ్రీవారి అన్న ప్రసాదాన్నే వితరణ చేయాలని నిర్ణయించడం అనేది..…

తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం గురువారం నాటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తిరుమల గిరుల్లో భక్తులు అందరికీ కూడా శ్రీవారి అన్న ప్రసాదాన్నే వితరణ చేయాలని నిర్ణయించడం అనేది.. సర్వధా అభినందనీయం.

తిరుమల గిరులు అంటేనే దైవస్వరూపంగా భక్తులు భావిస్తుంటారు. తిరుమల ఆలయంలో ఉండే మూల విరాట్టు, ఆలయం మాత్రమేకాదు.. సాక్షాత్తూ కొండ అంతా కూడా భగవత్ స్వరూపమే అని నమ్ముతుంటారు. అలాంటి తిరుమల గిరులలో వ్యాపారాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేస్తుంటాయి. పైగా రకరకాల హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వ్యాపారాలుగా విలసిల్లుతూ భక్తులను దోచుకుంటూ ఉండడం ఒక ఎత్తు అయితే.. ఆ వ్యాపారాల వాతావరణం అంతా ఎంతో గందరగోళంగా ఉంటుంది. 

ఇలాంటి నేపథ్యంలో తిరుమలలో దొరికే ప్రతి మెతుకు భగవంతుడి ప్రసాదమే అనే భావన భక్తులకు ఏర్పడడానికి టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ప్రతిరోజూ వేలాది మందికి ఉచితంగా అన్నదానం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా తిరుమలలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉదయం వేళల్లో అల్పాహారం సహా, భోజనం కూడా ఉచితంగా పెడుతూ ఉంటారు. 

ఇవన్నీ ఉన్నప్పటికీ.. ప్రెవేటు హోటళ్ల దందా యథావిధిగా సాగుతూనే ఉంటుంది. అయితే తిరుమలేశుని సన్నిధికి వచ్చిన భక్తుడు కడుపు నింపుకోడానికి డబ్బు పెట్టి కొనుక్కుని తినే అవసరమే ఉండకూదనే ఉద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

తిరుమ‌ల‌లో రాబోయే రోజుల్లో హోట‌ళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంట‌ర్లు పూర్తిగా తొలగిస్తారు. తిరుమల అన్ని ముఖ్య కూడ‌ళ్ళలో అన్నప్రసాదాలు ఉచితంగానే అందిస్తారు. అత్యున్నత స్థాయి నుండి సామాన్య భ‌క్తుడి వ‌ర‌కు ఒకే ర‌క‌మైన ఆహారం అందించాల‌ని తీర్మానించారు. అయితే, ఈ నిర్ణయం వ‌ల్ల కొంతమంది వ్యాపారుల‌కు ఇబ్బంది తప్పదు. వారికి ఇత‌ర వ్యాపారాలు చేసుకోవ‌డానికి లైసెన్స్‌లు మంజూరు చేయాల‌ని టీటీడీ నిర్ణయించింది. 

తిరుమలేశుని సన్నిధిలో దొరికే ప్రతిమెతుకూ భగవంతుడి ప్రసాదమే అనే భావన కలిగించడానికి.. అలాగే.. పేద ధనిక వ్యత్యాసం ఏమాత్రం లేకుండా.. తిరుమలేశుని ఎదుట భక్తులు అందరూ సమానమే అని నిరూపించేలా టీటీడీ ఈ గొప్ప నిర్ణయం తీసుకుంది.