రెండు కళ్ల సిద్దాంతం లో పిహెచ్ డి చేసిన లీడర్ చంద్రబాబు నాయుడు. ఏ విషయంలో అయినా ఆయనకు రెండు కళ్ల సిద్దాంతం వుంటుంది.
తెలంగాణ విషయంలో అయినా, అక్కడే కాంగ్రెస్ తో జత కట్టడంలో అయినా, ఇలా చాలా వాటిల్లో ఆయన తన సదుపాయానికి అనుగుణంగా ఈ 'రెండు కళ్ల థీసిస్' ను వాడేసుకుంటూ వుంటారు. ఇప్పుడు ఆ థీసిస్ ను మరింత సమర్ధవంతంగా వాడాల్సిన పరిస్థితి వచ్చింది.
తిరుపతి ఉపఎన్నికలో భాజపా కనుక రంగంలోకి దిగితే బాబుగారికి ఇంతా అంతా కష్టం కాదు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు మోడీ పై నిప్పులు చెరిగి, దాదాపు వ్యక్తిగత విమర్శలకు కూడా ఒడిగట్టి, దేశం అంతా కాలికి స్పెషల్ ఫ్లయిట్ కట్టుకుని మరీ తిరిగేసి, ఆయనను ప్రధాని కాకుండా చూడాలని తెగ తాపత్రయ పడిపోయారు.
తీరా చేసి ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన మరుక్షణం ప్లేటు మార్చేసారు. పైకి బాహాటంగా మాట్లాడకపోయినా భాజపాకు దాసోహం అన్నట్లుగా అయిపోయారు. పొరపాటున కూడా భాజపా, మోడీ, అమిత్ షా లాంటి పదాలు తన నోటి వెంట రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
అలా వచ్చాయి అంటే అవి అభినందించడం కోసం తప్ప వేరు కాదు. ఎలాగైనా వైకాపాను భాజపా నుంచి దూరం చేసి, ఆ సందులోకి తాను దూరిపోవాలని వుంది. అందుకోసం ఆయనతో సామాజిక బంధాలు పెనవేసుకున్న మీడియా కూడా తెగ వార్తలు వండుతూ కిందా మీదా అవుతోంది.
ఇలాంటి టైమ్ లో తిరుపతి ఎన్నిక వస్తోంది. ఇక్కడ భాజపా పోటీకి దిగితే పరిస్థితి ఏమిటి? కేవలం వైకాపాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసుకుంటూ పోవడమా? భాజపాను కూడా విమర్శించాలా? అలా విమర్శిస్తే మోడీ గురించి ఆయన పోలవరం, అమరావతి విషయాల్లో తీసుకున్న స్టాండ్ గురించి, రైతుల ఉద్యమం గురించి ప్రస్తావించాలా?వద్దా? ఇవన్నీ సమస్యలే.
ఇప్పుడు బాబుగారు రెండు కళ్ల సిద్దాంతం బయటకు తీస్తారు. వైకాపా రక్కసిని ముందు తరిమికొట్టాలని అటే దృష్టి పెడతారు. రాష్ట్ర ప్రయోజనాలు కీలకం కనుక వైకాపాను వ్యతిరేకిస్తామని, దేశ ప్రయోజానాల దృష్ట్యా మోడీని ఏమీ అనుకుండా వదిలేసారు.
ఈ తంతు అంతా భలే గమ్మత్తుగా, రంజుగా వుంటుంది. కానీ ఎటొచ్చీ దాన్ని బయటపడనిచ్చేలా ఆయన అను'కుల' మీడియా తన జాగ్రత్త తాను తీసుకుంటుందిగా. అదే బాబుగారి ధీమా.