పంచ్ అదిరింది.. పోలీసాఫీసర్ గా చంద్రబాబు

హీరోలు రకరకాల వేషాలు వేస్తారు. ఓ సినిమాలో మాఫియా డాన్ గా కనిపిస్తే, నెక్ట్స్ సినిమాలోనే సిన్సియర్ పోలీసాఫీసర్ గా మారిపోతుంటారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇలాంటి వేషం ఒకటి ఇస్తే బాగుంటుందేమోనంటూ జోకులు…

హీరోలు రకరకాల వేషాలు వేస్తారు. ఓ సినిమాలో మాఫియా డాన్ గా కనిపిస్తే, నెక్ట్స్ సినిమాలోనే సిన్సియర్ పోలీసాఫీసర్ గా మారిపోతుంటారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇలాంటి వేషం ఒకటి ఇస్తే బాగుంటుందేమోనంటూ జోకులు పేలుస్తున్నారు వైసీపీ జనాలు.

ఘోరంగా ఓడిపోయి, అధికారాన్ని పోగొట్టుకొని, నామ్ కే వాస్తే “ప్రతిపక్ష నాయుడు”గా కొనసాగుతున్న చంద్రబాబు.. వరుసగా డీజీపీకి లేఖలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే పలు దఫాలు డీజీపీకి లేఖలు రాసిన బాబు.. ఇప్పుడు ఇంకోసారి లేఖ రాశారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. శాంతిభద్రతలు క్షీణించాయని, అరాచక శక్తుల రాజ్యంగా రాష్ట్రం మారిపోయిందంటూ తనదైన శైలిలో లేఖ రాశారు బాబు. ఈసారి బాబు లేఖ రాయడానికి కారణం.. చిత్తూరు జిల్లాలో వరుస దాడులు, దౌర్జన్యాలంట. ఆ జిల్లాలో జరుగుతున్న దాడుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లుతోందట.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు.. తన లేఖలో అక్కసు మొత్తాన్ని కక్కేశారు చంద్రబాబు. ఇప్పుడీ లేఖ చూసి వైసీపీ నేతలు జోకులు పేలుస్తున్నారు. ఇలా రోజుకో లేఖ రాసే బదులు.. ఆ డీజీపీ పోస్ట్ ఏదో చంద్రబాబుకు ఇస్తే సరిపోతుందని సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా, లేనప్పుడు డీజీపీగా ఉంటూ తన సామాజిక వర్గ శాంతిభద్రతల్ని బాబు బాగా చూసుకుంటారని జోకులు పేలుస్తున్నారు.

నిజానికి ఇలాంటి లేఖలపై ఇదివరకే డీజీపీ సీరియస్ అయ్యారు. ఏదైనా లేఖ రాసేముందు స్పష్టమైన ఆధారాలు ఉంచుకోవాలని, మరీ ముఖ్యంగా మీడియాకు లేఖ అందించిన తర్వాత తనకు పంపించడం అస్సలు బాగాలేదని సుతారంగా చురకలు అంటించారు. చట్టప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలా రోజుకో లేఖతో ఆరోపణలు చేయడం భావ్యం కాదని అన్నారు.

అయినప్పటికీ బాబు వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పటికే తన లేఖలతో కొన్ని అంశాల్ని రాజకీయం చేయాలని చూశారు చంద్రబాబు. కానీ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టంగా వ్యవహరించడంతో బాబు తన చేతులు తానే కాల్చుకున్నారు. ఇలాంటి స్వీయ అనుభవాలు ఉన్నప్పటికీ బాబు ఇలా లేఖలు రాయడం మానడం లేదు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో 2వందల మంది టీడీపీ నాయకుల వాహనాలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయనేది బాబు ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణలో కూడా డొల్లతనాన్ని రుజువులతో సహా పోలీసులు బయటపెట్టడం ఖాయం. అప్పుడు ఈ అంశాన్ని వదిలేసి, మరో టాపిక్ కోసం బాబు పాకులాడడం అంతకంటే ఖాయం. 

మ‌రో జోస్యం వ‌దిలిన స‌బ్బం