ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచి వ్యవస్థలతో పోరాడుతూనే ఉన్నారు వైఎస్ జగన్. కొన్ని వ్యవస్థల్ని సమూలంగా ప్రక్షాళన చేయగలిగారు. మరికొన్ని వ్యవస్థల ప్రక్షాళనకు సంబంధించి కోర్టుల్లో కేసులు నలుగుతున్నాయి.
ఇవి కాకుండా, చంద్రబాబు సృష్టించిన కొన్ని అవ్యవస్థలతో నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇన్ని తలనొప్పుల మధ్య ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి.
ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిసి కూడా బ్యాంకర్లు కొన్ని సందర్భాల్లో రైతులు, పొదుపు మహిళల బాకీ చెల్లింపు విషయంలో కఠినంగా ఉంటారు. బ్యాంకులు ఉదారంగా ఉంటేనే, రుణ లభ్యత పెరిగి, ప్రజలకు ఆదాయ మార్గాలు దగ్గరవుతాయి.
కార్పొరేట్లకు నిబంధనలు ఉల్లంఘించి మరీ దోచిపెట్టి దివాళా తీసే బ్యాంకులు, పేదలు, రైతుల పట్ల మాత్రం ఎందుకో చాలా కఠినంగా ఉంటాయి. ఇకపై ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని సీరియస్ గా చెప్పేశారు సీఎం జగన్.
ఇందుకు సహేతుక కారణాన్ని కూడా బ్యాంకర్లకు వివరించారు సీఎం. స్వయం సహాయక సంఘాలను ఉదాహరణగా తీసుకుంటే.. ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల నుంచి 7500 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అవుతుంటాయి.
దీనికిగాను బ్యాంకులు ఇచ్చే వడ్డీ కేవలం 3 శాతం మాత్రమే. అదే పొదుపు సంఘాల మహిళలు.. బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే 11 నుంచి 13 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంటాయి. ఇదెక్కడి న్యాయం. బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సూటి ప్రశ్న ఇది.
నెలనెలా పొదుపు సంఘాలు ఠంచనుగా డబ్బు తీసుకొచ్చి జమ చేస్తుంటే.. కనీసం వారికి ఇచ్చే రుణాల్లో కూడా బ్యాంకులు ఉదారంగా వ్యవహరించకపోతే ఎలా? ఇదే విషయంపై బ్యాంకర్లను నిలదీశారు సీఎం జగన్. కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు కూడా బ్యాంకులు ముందుకు రావాలని, రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై దృష్టిపెట్టాలని కోరారు.
రుణాలను రీస్ట్రక్చర్ చేసి ఔత్సాహిక గ్రామీణ పారిశ్రామిక వేత్తలను ఆదుకోవాలన్నారు. మొత్తమ్మీద ఇన్నాళ్లూ తమని బుజ్జగించి, వారికి కావాల్సిన పనులు చేయించుకునే నాయకుల్నే ఇంతవరకూ బ్యాంకర్లు చూశారు. ఇప్పుడు పేదల పక్షాన సాక్షాత్తూ సీఎం దబాయిస్తుండే సరికి బ్యాంకర్లు బిక్కమొహం వేశారు.
చంద్రబాబులా చూసీచూడనట్టు వదిలేయడం లేదు జగన్. కచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సిందేనంటూ హుకుం జారీచేశారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వం వడ్డీలేకుండా 10వేల రూపాయల రుణం ఇస్తోందని, అలాంటి వారికి బ్యాంకర్లు మరింత అండగా ఉండాలని చెప్పారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకులు అండగా ఉండాలన్నారు, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కూడా అవసరమైన సహకారం అందించాలని, లబ్ధిదారుల్ని బకాయిల పేరుతో వేధించొద్దని సూచించారు.
అయితే జగన్ అనుకున్నంత సులువుగా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు సాధ్యం కావంటున్నారు నిపుణులు. పథకాలకు తగ్గట్టు ఏమైనా చిన్నచిన్న మార్పుచేర్పుల్ని ప్రభుత్వం చేయించుకోగలదేమో కానీ.. పూర్తిగా జగన్ ఆలోచన విధానానికి తగ్గట్టు ఈ వ్యవస్థను మార్చడం జగన్ వల్ల కాదు.
నిజానికి అది అతడి చేతిలో కూడా లేదు. ఏదేమైనా ఉన్నంతలో పేదల సంక్షేమం కోసం జగన్, బ్యాంకులతో కూడా కొట్లాటకు సిద్ధమయ్యారనే చెప్పాలి.