ఇక్కడ తోలు తీస్తా.. అక్కడ శాలువా వేస్తా

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కేంద్రాన్ని ఎన్ని మాటలన్నారో అందరికీ తెలుసు. హైదరాబాద్ కేంద్రంగా కూటమి కడతా, కేంద్రం మెడలు వంచుతానంటూ ఆవేశపడ్డారు. అంతెందుకు 4 రోజుల క్రితం జరిగిన భారత్ బంద్ ముందు…

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కేంద్రాన్ని ఎన్ని మాటలన్నారో అందరికీ తెలుసు. హైదరాబాద్ కేంద్రంగా కూటమి కడతా, కేంద్రం మెడలు వంచుతానంటూ ఆవేశపడ్డారు. అంతెందుకు 4 రోజుల క్రితం జరిగిన భారత్ బంద్ ముందు కేసీఆర్ పేల్చిన మాటల తూటాలు ఎవరూ మరచిపోలేదు. కేంద్రానికి బుద్ధి చెబుతాం, తెలంగాణ సత్తా చాటుతామంటూ భారత్ బంద్ ని టీఆర్ఎస్ శ్రేణులు పనిగట్టుకుని మరీ విజయవంతం చేశాయి.

హైదరాబాద్ లో తోలు తీస్తా, తాట తీస్తానంటూ మాట్లాడిన కేసీఆర్.. ఢిల్లీ వెళ్లే సరికి కేంద్ర మంత్రులకు శాలువాలు కప్పుతూ శాంతి వచనాలు పలుకుతున్నారు. వరదసాయం ఇవ్వకుండా హైదరాబాద్ వాసుల్ని నిండా ముంచారని విమర్శించిన కేసీఆర్.. అదే నోటితో అమిత్ షా ని వరదసాయం చేయమని కోరారు. 

విపత్తు నిధులు సకాలంలో అందించాలని, ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.650 కోట్ల నిధులు ఖర్చు చేసిందని, వాటిని కూడా విడుదల చేయాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రిని కలసి తెలంగాణ ప్రాజెక్ట్ అనుమతులపై చర్చించారు కేసీఆర్. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని వివరించారు.

అయితే ఈ ఇద్దరు మంత్రులను కేసీఆర్ ఏకాంతంగా కలవడం విశేషం. అధికారులు లేకుండానే 40 నిమిషాల పాటు అమిత్ షా తో ఏకాంతంగా చర్చలు జరిపిన కేసీఆర్.. రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా? ఒకవేళ రాజకీయాలే మాట్లాడితే.. పోరు నష్టం – పొందు లాభం.. అనే ఫార్ములా పాటిద్దామని అడిగి ఉంటారా? ఇవే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక ఈరోజు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నారు కేసీఆర్. వీరిని కూడా ఏకాంతంగా కలిస్తే మాత్రం ఇది అధికారిక పర్యటన కాదు, రాజకీయ పర్యటనే అనుకోవాలి.

దుబ్బాకలో ఎదురు దెబ్బ, జీహెచ్ఎంసీలో పరాభవం తర్వాత కేసీఆర్, కేంద్ర మంత్రుల మధ్య జరుగుతున్న ఈ వరుస భేటీలు ఆసక్తికరంగా మారాయి. అమిత్ షా కి శాలువా కప్పి నమస్కరిస్తున్న కేసీఆర్ ఫొటోని అప్పుడే తెలంగాణ బీజేపీ నేతలు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 

గతంలో నిజాం రాజు, వల్లభాయ్ పటేల్ కు నమస్కరిస్తున్న ఫొటోని జత చేసి, “నియంతృత్వ నైజం.. ఎన్నడైనా చెయ్యవలసిందే ప్రజాస్వామ్యానికి ప్రణామం” అంటూ రెచ్చగొట్టే క్యాప్షన్ పెట్టారు విజయశాంతి.

మరోవైపు కేంద్రం నిధుల్ని రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందంటూ కిషన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విమానాశ్రయం పేరుతో కేసీఆర్ మాటల గారడీ చేస్తున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ నేతలు ఇవన్నీ గమనిస్తున్నా కూడా రియాక్ట్ కాకపోవడం విశేషం.

మొత్తమ్మీద తెలంగాణలో వరుస ఓటముల తర్వాత కేసీఆర్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మార్పు ఈ భేటీల్లో తెలిసిపోతోంది. మరి కేసీఆర్ మనసులో ఏముందో ఆయన మాట్లాడితేనే తెలుస్తుంది. 

మ‌రో జోస్యం వ‌దిలిన స‌బ్బం