భాగమతి సినిమాకు తెలుగులో ఎంత పేరు వచ్చిందో తెలియంది కాదు. అనుష్క హీరోయిన్ గా తయరైన ఈ సినిమా కోసం నిర్మాతలు అయిన యువి సంస్థ ఎంత కిందా మీదా పడిందో అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.
డైరక్టర్ అశోక్ నుంచి అవుట్ పుట్ తీసుకోవడానికి, తీసుకున్న అవుట్ పుట్ ను సెట్ చేసుకోవడానికి యువి జనాలు తల్లకిందలయ్యారు. ఆ సినిమాను సెట్ చేయడానికి చాలా కూడికలు తీసివేతలు చేసి, ఆఖరికి విడుదల చేసి శభాష్ అనిపించుకున్నారు.
అది చూసి డైరక్టర్ అశోక్ కు హిందీ చాన్స్ వచ్చేసింది. దుర్గమతి అంటూ భాగమతినే హిందీ లో అందించాడు. అదే అశోక్ తెలుగులో తీసిన సుకుమార్ సినిమా ఎలాంటి ఫలితం ఇచ్చిందో దుర్గమతి అలాంటి ఫలితాన్నే ఇచ్చింది.
బాలీవుడ్ లో దారుణమైన సమీక్షలు వచ్చాయి ఈ సినిమాకు. రేటింగ్ లు కూడా దారుణంగా వున్నాయి. పిల్ల జమీందార్, భాగమతి తీసిన అశోక్ నే సుకుమారుడు, చిత్రాంగద, దుర్గామతి తీసాడు అంటే ఏమనుకోవాలి. భాగమతిని యువి గట్టెక్కించగలిగింది. దుర్గామతి అలా కాలేకపోయింది.