ఓ పక్క హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కీలకంగా వున్న టైమ్ లో చటుక్కున ఢిల్లీ వెళ్లారు జనసేనాధిపతి పవన్ ఆయన సచివుడు మనోహర్. ఎందుకు వెళ్లారన్నది ఎవరికీ తెలియదు.
ఎలాగో కిందా మీదా పడి ఒకరిద్దర్ని కలిసి వచ్చారు. వచ్చింది తిరుపతి సీటు కోసం కాదు, పోలవరం, అమరావతి అంటూ ఏదేదో చెప్పారు రెండు నిమషాల పాటు. ఆ తరువాత మనోహర్ మళ్లీ ఎప్పటిలా సైలంట్ అయిపోయారు.
పవన్ మాత్రం చిత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో వరద బాధితుల పరామర్శ అంటూ రోడ్ షో లు, బైక్ ర్యాలీలు చేసి హడావుడి చేసారు. ఇదంతా తిరుపతి టికెట్ కోసమే అని వినిపించింది.
సరే, ఆ తరువాత పవన్ వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయారు. భాజపా రంగంలోకి దిగింది. తిరుపతిలో హల్ చల్ చేస్తోంది. భాజపా బిగ్గీస్ అంతా తిరుపతి రంగంలోకి దిగుతున్నారు.
ఇదంతా చూస్తుంటే జనసేన ఇక తిరుపతి మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేలా వుంది. మరోపక్కన తిరుపతి గెల్చుకోవాలని అనుకుంటున్న తెలుగుదేశం కూడా దిగాలు పడే పరిస్థితి. గెలవడం మాట సరే, మూడో స్థానానికి జారిపోకూడదు అని చూసుకోవాలి.
భాజపా హడావుడి చూస్తుంటే జనసేనకు తిరుపతి టికెట్ ఇచ్చే ఉద్దేశం వున్నట్లు కనిపించడం లేదు. నిజానికి ఢిల్లీలో తాము తిరుపతి సీటు కోసం రాలేదని చెప్పి నమ్మించడానికి ప్రయత్నించినపుడే విషయం కాస్త అర్థమైపోయింది.
ఇప్పుడు సీటు తమకు వదలకపోతే జనసేన ఏం మాట్లాడుతుందో, తమకు తిరుపతిలో బోలెడు బలం వుందని, కాంగ్రెస్ నేత చిరంజీవి అక్కడ గెలిచారని అది తమ బలం అన్నట్లుగా జనసేన చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరి ఏమంటుందో చూడాలి.
భాజపా-జనసేన బంధం 2024 వరకు వుండేది కాదనే గుసగుసలు వుండనే వున్నాయి. మరి ఆ గుసగుసలు నిజం కావడానికి తిరుపతి నాంది పలుకుతుందా? చూడాలి.