కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు…!

తెలంగాణ రాజ‌కీయం కేసీఆర్ అనారోగ్యాన్ని కూడా విడిచిపెట్ట‌లేదు. కాదేదీ క‌విత‌కు అన‌ర్హ‌మ‌ని మ‌హాక‌వి అన్నారు. అయితే అది రాజ‌కీయానికి కూడా వ‌ర్తింప‌చేస్తున్నారు. తెలంగాణ‌లో మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాజ‌కీయంగా ఆధిప‌త్యం సాధించేందుకు…

తెలంగాణ రాజ‌కీయం కేసీఆర్ అనారోగ్యాన్ని కూడా విడిచిపెట్ట‌లేదు. కాదేదీ క‌విత‌కు అన‌ర్హ‌మ‌ని మ‌హాక‌వి అన్నారు. అయితే అది రాజ‌కీయానికి కూడా వ‌ర్తింప‌చేస్తున్నారు. తెలంగాణ‌లో మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాజ‌కీయంగా ఆధిప‌త్యం సాధించేందుకు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా విడిచిపెట్ట‌డం లేదు.

కొన్ని రోజులుగా అనారోగ్య కార‌ణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇంట్లో వుంటూ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కేసీఆర్ అనారోగ్యంపై ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే.

కేసీఆర్‌కు ఛాతిలో సెకెండ‌రీ ఇన్‌ఫెక్ష‌న్ వున్న‌ట్టు వైద్యులు నిర్ధారించార‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కోలుకోడానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వాటికి సీఎం కేసీఆర్ త‌ర‌పున తానే స‌మాధానం ఇస్తున్న‌ట్టు కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండ‌డం వ‌ల్ల తాను ప్ర‌ధానికి కౌంట‌ర్ ఇస్తున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

కేసీఆర్ అనారోగ్యంపై బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ కీల‌క కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేటీఆర్‌ను కోరారు. కేసీఆర్ ఆరోగ్యంపై త‌మ‌కు అనుమానాలున్నాయ‌ని ఆమె అన్నారు. సీఎం కావాల‌న్న ఆత్రుత‌తో కేసీఆర్‌ను నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని కేటీఆర్‌కు డీకే అరుణ సూచించారు.  

కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేయాలంటూ తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీకి సాధార‌ణ ప్ర‌జానీకం ఉత్త‌రాలు రాయ‌డం గ‌మ‌నార్హం. చాలా రోజులుగా కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌ల్లో క‌నిపించ‌డం లేదని, అస‌లు ఆయ‌న‌కు ఏమైందో తెలుసుకోవాల‌ని వుందంటూ రాసిన లేఖ‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఇలా ప్ర‌త్య‌ర్థులు కేసీఆర్ ఆరోగ్యం చుట్టూ రాజ‌కీయం న‌డ‌ప‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.