ఏలూరు ఘటన.. తొందరగా తేల్చాల్సిందే!

ఏలూరులో వరుసగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని తెలిసినప్పటి నుంచీ అందరికీ తాగునీటిపైనే అనుమానం ఉంది. వైద్యులు, అధికారులు, పలువురు నేతలు కూడా తాగునీరు కలుషితం కావడం వల్లేనని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. తీరా…

ఏలూరులో వరుసగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని తెలిసినప్పటి నుంచీ అందరికీ తాగునీటిపైనే అనుమానం ఉంది. వైద్యులు, అధికారులు, పలువురు నేతలు కూడా తాగునీరు కలుషితం కావడం వల్లేనని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. తీరా ఇప్పుడు అసలు కారణం తాగునీరు కాదని చెప్పడం విశేషం. ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కు వివరణ ఇచ్చిన అధికారులు గాలి-నీరు కలుషితం కాలేదని చెప్పారు.

గాలి కాదు, నీరు కాదు… మరింకేంటి? అనే కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి. బాధితుల రక్త నమూనాల్లో నికెల్, సీసం ఉన్న మాట వాస్తవమేనంటున్న అధికారులు.. అవి గాలి, నీరు ద్వారా వారి శరీరంలోకి వెళ్లలేదని మాత్రం చెప్పగలుగుతున్నారు. ఆహారం కల్తీ విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

బియ్యంలో పాదరసం కలసిన ఆనవాళ్లు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బియ్యం, పప్పులు, కూరగాయలు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్ధాలను పరిశీలిస్తున్నామని ఈనెల 16 నాటికి అసలు కారణం చెబుతామని అంటున్నారు.

ఎవరెవరు ఏమంటున్నారు..?

బాధితుల ఇళ్లలో సేకరించిన బియ్యంలో పాదరసం ఆనవాళ్లు అధికంగా ఉన్నాయి. టమోటా వంటి కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు గుర్తించాం, బాధితుల రక్తంలో ఆర్గోనా పాస్ఫరస్ ఉంది, అయితే అది వారి శరీరంలోకి ఎలా చేరిందో గుర్తించాల్సి ఉంది. – ఎన్ఐఎ, హైదరాబాద్

ఏలూరులోని పలు ప్రాంతాల్లో పాల నమూనాలు సేకరించాం. పాలలో నికెల్ అవశేషాలున్నాయి. బాధితుల మూత్రంలో లెడ్, రక్త నమూనాల్లో లెడ్, నికెల్ రెండూ ఉన్నాయి. పురుగు మందులు అధికంగా వాడటం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశముంది. ఆహార పదార్ధాల్లో ఆర్గానో క్లోరిన్ ఉందా లేదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. – ఎయిమ్స్, ఢిల్లీ

తాగునీటిలో లెడ్ లేదు, ఆర్గానో క్లోరిన్, పాస్ఫేట్ కనిపించలేదు. సీరం నమూనాల్లో ఉన్న ఆర్గానో క్లోరిన్, పాస్ఫరస్ వల్లే బాధితులు స్పృహతప్పి పడిపోయారు. తాగునీటితో మాత్రం ఎలాంటి సమస్య లేదు – ఐఐసీటీ హైదరాబాద్

ఏలూరులో మొత్తం 100 చోట్లనుంచి సేకరించిన తాగునీటిని పరీక్షించాం. భార లోహాల ఆనవాళ్లు లేవు. భూగర్భ జలాలను పరిశీలిస్తున్నాం, మరికొన్నిరోజుల్లో ఫలితాలు వస్తాయి. నీటిలో ఈ-కోలి సాధారణ స్థాయిలోనే ఉంది. – ఏలూరు పురపాలక శాఖ

వాతావరణం కలుషితంగా ఉందనే మాట అవాస్తవం, వాయువులన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. పురుగు మందుల అవశేషాల గుర్తింపు పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది – ఆంధ్రప్రదేశ్ వాతావరణ కాలుష్య మండలి

ఎంతమంది, ఎన్ని రకాల విశ్లేషణలు చెబుతున్నా.. ఎక్కడా క్లారిటీ లేదు. రాగా పోగా అందరూ ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ పోతున్నామని అనుకుంటున్నారు కానీ, కొత్త చిక్కులు తెస్తున్నారు. గాలి కాలుష్యం కాదంటున్నారు, నీరు బాగానే ఉందంటున్నారు.. ఇక దేన్ని అనుమానించాలి, ఏయే పదార్థాలను ధైర్యంగా తినాలి.

ఏలూరు ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ పరిస్థితి ఎందుకొచ్చిందనే విషయంపై అధికారుల వద్ద సరైన సమాధానం లేకపోవడం గమనార్హం. మరోవైపు బాధిత ప్రాంతాల నుంచి కొంతమంది ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. మరికొంతమంది తమ పిల్లల్ని బంధువుల ఇళ్లకు పంపిస్తున్నారు.

ఈ స్కీమ్ సఫలం అయితే ఎపి దేశానికి రోల్ మోడల్ అవుతుంది