తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఆ పనుల మీద ఢిల్లీలో మకాం పెట్టారట. పార్టీ పేరును రిజిస్టర్ చేయించడంతో సహా గుర్తుకు అప్లికేషన్ పెట్టుకోవడం తదితర పనుల్లో ఉన్నారట రజనీ.
డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టిన రోజు కూడా. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనుల్లో ఉండి ఈ పుట్టిన రోజున అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నారు సూపర్ స్టార్. నేటితో రజనీకాంత్ 70 సంవత్సరాలను పూర్తి చేసుకోబోతున్నారు.
పొలిటికల్ ఎంట్రీకి ఇది చాలా ఎక్కువ వయసే అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే రజనీకి ఇప్పటికి కానీ కుదరలేదు. మరి ఈ వయసులో ఆయన ప్రచారాన్ని అయినా ఏ మేరకు హోరెత్తిస్తారు? అనేది ప్రశ్నార్థకమే. అందునా మరీ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఎన్నికలకు ఐదారు నెలల ముందు పార్టీని రిజిస్టర్ చేయిస్తున్నారు!
వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు పార్టీని ఏర్పాటు చేస్తున్నారు రజనీ. అంటే ఎన్నికలకు ఐదారు నెలల కాల్షీట్లను కేటాయిస్తున్నారు. ఇదంతా కొండకు వెంట్రుక వేస్తున్నట్టుగా ఉంది. వస్తే కొండ, పోతే వెంట్రుక అన్నట్టుగా ఉంది రజనీకాంత్ రాజకీయం.
ఎన్టీఆర్ ఎన్నికలకు 9 నెలల ముందు క్యాల్షీట్లను కేటాయించారు. చిరంజీవి అంత కన్నా రెండు మూడు నెలలు తక్కువ సమయాన్ని కేటాయించారు. రజనీకాంత్ చిరంజీవి కన్నా తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా ఉన్నారు.
తొలి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే వీరి తదుపరి రాజకీయం సాగుతుంది. అనుకున్నది జరగకపోవడంతో చిరంజీవి పార్టీని విలీనం చేసేశారు. మరి రేపు రజనీకాంత్ అయినా సీఎం సీటు అందకపోతే జెండా పీకేస్తారని వేరే చెప్పనక్కర్లేదు!
అంతకన్నా కామెడీ ఏమిటంటే.. రజనీకాంత్ చేతిలో ఉన్న పెండింగ్ సినిమాల షూటింగ్ ఉండటం! ఒక భారీ పిక్చర్ షూటింగ్ దశలో ఉంది. దానికి కనీసం రజనీకాంత్ 40 రోజులను కేటాయిస్తున్నారట. ఈ విషయాన్నే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు.
పార్టీని రిజిస్టర్ చేయించి.. డైరెక్టుగా రజనీకాంత్ సినిమా షూటింగుకు వెళ్తున్నారు. ఎన్నికలకు మిగిలిన ఐదారు నెలల్లో కూడా నెలన్నర పాటు షూటింగ్ కే రజనీ సమయం కేటాయించనున్నారు.. ఇదేనా ప్రజాసేవా, ఇదేనా రాజకీయ నేతగా ప్రజల్లో ఉండటం అనే ప్రశ్నలను తమిళనాడు కాంగ్రెస్ వాళ్లు ఆల్రెడీ రైజ్ చేస్తున్నారు.