తెలంగాణ పోరులో.. కాషాయ పార్టీ ఎందుకు వెనుక‌బ‌డ్డ‌ట్టు?

తెలంగాణ‌లో బీజేపీ గురించి మాట్లాడ‌టం అంటే.. ఏడాది కింద‌టి వ‌ర‌కూ అదో లెక్క‌! తీరా ఎన్నిక‌ల ముంగిట మాత్రం మ‌రో లెక్క‌గా మారింది వ్య‌వ‌హారం! ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు తెలంగాణ‌లో…

తెలంగాణ‌లో బీజేపీ గురించి మాట్లాడ‌టం అంటే.. ఏడాది కింద‌టి వ‌ర‌కూ అదో లెక్క‌! తీరా ఎన్నిక‌ల ముంగిట మాత్రం మ‌రో లెక్క‌గా మారింది వ్య‌వ‌హారం! ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు తెలంగాణ‌లో బీజేపీకి ఉన్న జోష్ లో ప‌దోవంతు కూడా ఇప్పుడు లేదు! ఎందుకు అలా.. ఏం జ‌రిగింది.. ఏదో మంత్ర‌మేసిన‌ట్టుగా ఎక్క‌డ వ్య‌వహారం మారిపోయింద‌నే విష‌యం కాషాయ పార్టీ వీర భ‌క్తుల‌కు కూడా అంతుబ‌ట్ట‌ని ప‌రిస్థితి! 

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తెలంగాణ‌లో బీజేపీ జోష్ త‌గ్గింద‌నే విశ్లేష‌ణ ఉన్నా.. వాస్త‌వానికి అప్ప‌టికే ప‌రిస్థితి చేయి దాటిపోయింది. తెలంగాణ పోరులో బీజేపీ వెనుక‌బ‌డి చాలా కాలం అయ్యింది!

ఇప్పుడు మోడీనే స్వ‌యంగా రంగంలోకి దిగినా.. క‌మ‌లం పార్టీకి కావాల్సిన జోష్ అయితే రావ‌డం లేదు. టీఆర్ఎస్ కు తామే ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకున్న ద‌శ నుంచి బీజేపీ చాలా వెనుక‌బ‌డింది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లప్పుడు, ఆ ఫ‌లితాల‌ప్పుడు బీజేపీలో ఉన్న జోష్ అంతా ఇంతా కాదు. ఇదంతా గ‌తంగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఓట‌ర్ మ‌దిలో బీజేపీ స్థానం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చే ప‌రిస్థితి నుంచి బీజేపీ త‌నంత‌ట తానే వెన‌క‌డుగు వేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది వ‌ర‌స‌గా!

అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ వ‌స్తే.. అస‌లు బీజేపీ అభ్య‌ర్థులెవ‌ర‌నే ఆస‌క్తి కూడా ప‌రిశీల‌కుల‌కు లేకుండా పోతోంది. వాస్త‌వానికి బీజేపీ తెలంగాణ‌లో అధికారం సాధించేస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు కూడా బీజేపీకి నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో నేత‌ల క‌రువు తీవ్రంగా ఉండింది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు పోటీ చేస్తారు, ఎవ‌రు పోటీ ఇస్తారు అనే మాట‌ను చెప్ప‌లేక‌పోయినా.. అదిగో అధికారం అనే మాట అయితే క‌మ‌లం వాణిలో వినిపించింది. తీరా అస‌లు సామ‌ర్థ్య‌మేమిటో చూపాల్సిన స‌మ‌యంలో ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ క‌నీస పోటీలో ఉండ‌గ‌ల‌ద‌నేది ప్ర‌శ్న‌గా మారింది!

గ‌త లోక్ స‌భ ఎన్నిక‌లప్పుడు బీజేపీ అంచ‌నాల‌కు మించి రాణించింది. సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేసింది. అయితే ఆ త‌ర్వాత సంస్థాగ‌తంగా బ‌ల‌ప‌డ‌టం మీద శ్ర‌ద్ధ పెట్టాల్సిన ఆ పార్టీ అలాంటి ప‌నుల‌కు పూనుకోలేదు. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వెనుక కూడా తెలంగాణ‌లో ఏనాటికి అయినా బ‌ల‌ప‌డొచ్చ‌న్న ఆ పార్టీ సిద్ధాంత‌క‌ర్త‌లు ఆశ‌లు ఉండేవి. అయితే ఇప్ప‌టికీ తెలంగాణ‌లో బీజేపీ అదికార ప‌క్షానికి బీజేపీ ప్ర‌ధాన ప్ర‌త్యర్థి అయ్యే ప‌రిస్థితుల్లో లేదు!

అన్నింటికీ మించి.. కేసీఆర్ తో బీజేపీకి ర‌హ‌స్య దోస్తీ అనే ప్ర‌చారానికి కూడా అవ‌కాశం ఏర్ప‌డింది. టీఆర్ఎస్ ను అవినీతి పార్టీ అంటూ మోడీ విమ‌ర్శిస్తూ ఉన్నారు. ఏదేదో చెబుతూ ఉన్నారు. అయితే మ‌రి కేంద్ర ధర్యాప్తు సంస్థ‌ల‌న్నీ క‌మ‌లం పార్టీ కీల‌క నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే క‌దా ఉన్నాయి! అలాంట‌ప్పుడు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌నే ప్ర‌శ్న స‌హజంగానే ఉత్ప‌న్నం అవుతోంది. తీరా ఎన్నిక‌లొచ్చిన‌ప్పుడు టీఆర్ఎస్ కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అనే మాట‌లు బీజేపీ నేత‌ల వెంట వ‌స్తే.. మ‌రి ఇన్నాళ్లు ఏం చేశార‌నే లాజిక్ ప్ర‌జ‌ల్లో రేకెత్త‌దా?

బీజేపీ లేచిన‌ట్టే లేచి వెనుక‌బ‌డ‌టం కాంగ్రెస్ పార్టీకి అనుకూల‌మైన అంశం. కాంగ్రెస్ క‌థ అయిపోయింద‌ని చాలా మంది అనుకున్నారు. అయితే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌తో కాంగ్రెస్ కు కొత్త ఆశ‌లు రేకెత్తాయి. కేసీఆర్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త కూడా కాంగ్రెస్ అనుకూల‌త‌గా మారుతోంది. దీన్నే క్యాష్ చేసుకోవాల్సిన క‌మ‌లం పార్టీ తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆ స్థితిలో అయితే లేన‌ట్టుగా ఉంది! 

తెలంగాణ‌లో మ‌రోసారి టీఆర్ఎస్ అయినా గెల‌వాలి, లేదా కాంగ్రెస్ సంచ‌ల‌నం అయినా న‌మోదు చేయాలి.. అనే అభిప్రాయం సాటి తెలుగురాష్ట్రం నుంచి వినిపిస్తోంది. అంతే కానీ బీజేపీ పోటీ ఇస్తుంద‌నో, బీజేపీ అధికారం సంపాదించుకుంటుంద‌నో అభిప్రాయాన్ని గ‌ట్టిగా వ్య‌క్తం చేసే వారు లేకుండా పోయారు. ఈ ప‌రిస్థితికి కార‌ణం బీజేపీ వ్య‌వ‌హ‌ర‌ణ తీరే కాబోలు!