విశాఖను రాజధాని అని ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవకపోయినా ఆ హోదా మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. దర్జా కూడా అంతకంతకు పెరిగిపోతోంది. ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఊపేయడంతో అప్పట్లో విశాఖకు కూడా ప్రముఖుల రాకపోకలు తగ్గాయి.
మెల్లగా కరోనా తగ్గుముఖం పట్టడంతో వైజాగ్ కి కొత్త హుషార్ వచ్చింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారం రోజుల సుదీర్ఘ పర్యటన పెట్టుకుని మరీ విశాఖలో ఇపుడు విడిది చేస్తున్నారు. ఆయన్ని రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు వరసగా భేటీ అవుతూండడంతో విశాఖలో సందడి నెలకొంది.
ఇక ఉప రాష్ట్రపతిని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి నాయకత్వంలో టీడీపీ బృందం తాజాగా కలసి ముచ్చటించింది. ఇక మరో వైపు విశాఖకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఉద్దండులు రావడమూ విశేషమే.
అంతే కాదు, విశాఖలో ప్రభుత్వ మాజీ సలహాదారు, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అయితే విశాఖలో రాజధాని విషాదం అంటూ వర్తమాన రాజకీయ సినిమానే చూపించేశారు.
ఒకదానితో మరొకటి పొంతన లేకపోయినప్పటికీ ఇలా విశాఖకు తాకుతున్న ప్రముఖుల రాకపోకల వెనక ఏదో జరుగుతోందన్న ప్రచారం మాత్రం గట్టిగా సాగుతోంది. మొత్తానికి కొత్త ఏడాది దగ్గరపడుతున్న వేళ రాజకీయమంతా విశాఖ చుట్టూనే సాగుతూండడం విశేషం.