సమీక్ష: కరోనా వైరస్
రేటింగ్: 0.5/5
బ్యానర్: కంపెనీ, సిఎం క్రియేషన్స్
తారాగణం: శ్రీకాంత్ అయ్యంగార్, వంశీ చాగంటి, సోనియా ఆకుల, కల్పలత గార్లపాటి, దక్షి గుత్తికొండ, దొర సాయితేజ తదితరులు
రచన: కళ్యాణ్ రాఘవ్ పసుపుల
సంగీతం: డి.ఎస్.ఆర్
కూర్పు: నాగేంద్ర
ఛాయాగ్రహణం: వి. మల్హభట్ జోషి
నిర్మాతలు: రామ్ గోపాల్ వర్మ, నన్నపురెడ్డి, ఎల్లారెడ్డి
దర్శకత్వం: అగస్త్య మంజు
విడుదల తేదీ: డిసెంబరు 11, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో మున్ముందు చాలా సినిమాలు రావచ్చు. దేశాలకు దేశాలు ఆర్థిక వనరుల గురించి, పురోగతి గురించి కూడా ఆలోచించకుండా ముందు ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటూ లాక్‍డౌన్ చేసుకునేలా చేసిన మహమ్మారి అది.
కరోనా కొందరి ప్రాణాలు బలిగొంటే చాలా మంది జీవనాధారాన్ని పోగొట్టి, ఎంతోమంది ప్రణాళికలను చెడగొట్టి… జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఆ వైరస్ ఎలా పుట్టింది, ఎలా సంక్రమించినదీ, ఏ విధంగా దేశాలను దాటిందీ, ఎంతగా ప్రజలను భయానికి లోను చేసిందీ లాంటి అంశాలతో దేశ, విదేశాలలో తప్పకుండా పలు సినిమాలొస్తాయి.
ముందుగా రామ్‍గోపాల్‍వర్మ తన కంపెనీ నుంచి ఆ వైరస్ తాలూకు పాపులారిటీని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయగా… వైరస్ కంటే కూడా ఈ సినిమా ఆసాంతం చూడడమే ప్రమాదకరం అన్న రీతిన ఇది తెరకెక్కింది. సినిమా మొదలైన తీరు చూస్తే… సినిమా కంటే ముందుగా ట్రెయిలర్ ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంత సడన్‍గా, ప్రోపర్ టేకాఫ్ లేకుండా స్టార్ట్ అవుతుంది.
కరోనా వైరస్ సినిమా మొత్తాన్ని ఒకే ఇంట్లో తీసేసారు. ఒకే ఒక్క సీన్లో రోడ్డుపై బైక్ కనిపిస్తుంది తప్ప మిగతా అంతా అదే చీకటి ఇంట్లో చితక్కొట్టుడు అన్నమాట. అత్తా కోడళ్ల గొడవతో మొదలయ్యే ఈ టీవీ సీరియల్ లాంటి సినిమాలో నెక్స్ట్ సీన్లోనే కరోనా, లాక్‍డౌన్ తాలూకు ప్రస్తావన వస్తుంది.
ఇక అంతే సంగతులు… ఇంట్లోనే వున్న భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు, కోడలు, బామ్మతో పాటు ఒక పని మనిషి సోషల్ డిస్టెన్స్ అంటూ నానా హంగామా చేసేస్తుంటారు. కరోనా భయంతో ఇంట్లో వాళ్లనే దూరం, దూరం అంటూ అరిచి గీపెట్టే ఇంటి పెద్ద రోజూ పని మనిషిని ఎలా బయటనుంచి రానిస్తున్నాడో అంతు చిక్కదు.
ఈ ఎనిమిది క్యారెక్టర్లు, సింగిల్ లొకేషన్ సినిమాను దాదాపు గంటన్నర సమయం ఎలా నడిపించాలో తెలియక రచయిత, దర్శకుడు అష్టకష్టాలు పడుతూ.. చూసే వాళ్లను అంతకుమించిన నరక యాతనకు గురి చేసారు. ప్రతి పాయింట్‍లెస్ సన్నివేశం ఎలాంటి డైరెక్షన్ లేకుండా సుదీర్ఘంగా మీనింగ్‍లెస్ సంభాషణలతో నడుస్తుంటుంది.
ఒక సీన్లో ఇంట్లోని టీనేజ్ పిల్లాడు ‘స్టఫ్’ కావాలంటూ బయటకు వెళ్లి, పోలీసులతో లాఠీ దెబ్బ తినేసి ఇంటికొస్తాడు. ఆ దెబ్బను అతను అద్దంలో చూసుకోవడం మొదలు ఆ సీన్ పూర్తి కావడానికి ఓ అయిదు నిమిషాలైనా సమయం పడుతుందేమో. ఇలాంటి సీన్లు చూడడం కంటే గోడకేసిన సున్నం ఎండే వరకు తదేకంగా చూసినపుడు ఎక్కువ ఎంటర్‍టైన్‍మెంట్ దొరుకుతుందేమో. కనీసం ఆ ఇంట్లోని వాళ్లంతా టీవీ ముందు కూర్చుని కరోనా న్యూస్ చూస్తోన్న సీన్ మాత్రమే చూపించేసి పంపించేసినా కొంతయినా వైరస్ గురించిన అవగాహన వచ్చేదేమో.
సినిమా థియేటర్లు తెరవకపోయినట్టయితే దీనిని కూడా ఒక ఇరవై, ముప్పయ్ నిమిషాల వీడియో తీసి ఆన్‍లైన్‍లో పెట్టేవాళ్లేమో. కానీ సినిమా థియేటర్లలో ప్రదర్శించడానికి గాను ఆ ఇరవై నిమిషాల షార్ట్ ఫిలింకి సరిపోయే కంటెంట్‍ను అంత సేపు జీళ్ల పాకంలా, ఏళ్ల కొద్దీ సాగే సీరియళ్లు సిగ్గు పడేలా సినిమా తీసారు.
ఒక దశ, దిశ లేకుండా సాగుతోన్న సినిమాలో కూతురు దగ్గడం మొదలు పెడుతుంది. అక్కడ ఇంటర్వెల్ ఇస్తే ఇక సెకండ్ హాఫ్ అంతా ఆమె దగ్గడం, మిగతా వాళ్లు భయపడడం, ఆమెను హాస్పిటల్‍కు తీసుకెళ్లమని గొడవ చేస్తుండడం, హాస్పిటల్‍కి వెళితే కరోనా వచ్చేస్తుందని తండ్రి భయపడుతూ వారించడం… ఇదే తంతు. కరోనా వచ్చిందేమో అని భయపడి టెస్టుకి వెళితే నెగెటివ్ రిజల్ట్ వచ్చిందని తెలిసినపుడు ఎంత ఆనందం వుంటుందో తెలియదు కానీ వీళ్ల ఇంటికి కరోనా టెస్టులు చేయడానికి డాక్టర్ల బృందం వచ్చినపుడు మాత్రం పరమానందం దక్కుతుంది.
పతాక సన్నివేశం కూడా ఏడ్చే వరకు విడిచి పెట్టేది లేదన్నట్టుగా రాచి రంపాన పెడుతుంది. ఏడెనిమిది నిమిషాల వాయిస్ మెసేజ్ పంపించే బదులు శ్రీకాంత్ అయ్యంగార్ ఆ ఆక్సిజన్ ట్యూబ్ నోట్లో పెట్టుకుని వుంటే బ్రతికి ఇంటికొచ్చేసుండే వాడు కదా అనిపిస్తుంది.
కనీసం ఆ వాయిస్ మెసేజ్ అయ్యాక అయినా ఆపేస్తారనుకుంటే… ప్రభుత్వాలు చూపించిన అశ్రద్ధ కారణంగానే ఇదంతా అయిందని ఫస్ట్రేట్ అయిన కొడుకు టీవీ సెట్ ఎత్తి నేలకేసి కొడతాడు. ఈ కరోనా వైరస్ పెట్టిన క్షోభకు గురయిన ఆడియన్స్ కూడా ఆ సీన్ చూసి ఇన్‍స్పయిర్ అయి తెరలు చించేస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్?
కరోనా వైరస్‍కి టీకా కనిపెట్టడం కోసం దేశ విదేశాలు కోట్లు ఖర్చు పెడుతూ కిందా మీదా పడుతున్నాయి కానీ ఒకవేళ ఆ వైరస్‍కే కనుక చెవులు, కళ్లు వుండి ఈ సినిమా చూడగలిగినట్టయితే దెబ్బకు చచ్చుండేది… లేదా కనీసం పిల్లా జల్లా చంకనెత్తుకుని తిరిగి చైనా చెక్కేసుండేది.
బాటమ్ లైన్: కరోనా కంటే డేంజరస్!