టెన్నిస్ గేమ్ కే తనదైన కల తెచ్చిన ఆటగాడు జొకొవిచ్.. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తన వ్యక్తిగత నిర్ణయానికి కట్టుబడి పతాక శీర్షికలకు ఎక్కుతున్నాడు. ఒకవైపు ప్రపంచంలోని కోట్ల మంది పోటీలు పడి వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. ఇండియాలో అయితే కొందరు డాక్టర్లు, వారి కుటుంబీకులు.. మూడో డోసు, నాలుగో డోసు వ్యాక్సిన్లను కూడా వేయించుకోవడానికి వెనుకాడటం లేదు.
చాలా మంది రెండు డోసులు వేయించుకుని ఆగారు. ఇక అమెరికాలో మూడో డోసు, ఇజ్రాయెల్ లో నాలుగో డోసు పాపులర్ పదాలయ్యాయి. మరి ప్రపంచం ఇంతా ఇలా కరోనాకు భయపడి ఎడాపెడా వ్యాక్సిన్లు పొడిపించుకుంటున్నా, ప్రపంచంలోని టెన్నిస్ అభిమానులకు ఆరాధ్యుడు అయిన ఈ సెర్బియన్ స్టార్ మాత్రం కోవిడ్ నివారణ వ్యాక్సిన్లను వేయించుకోవడం లేదు!
ఆ మధ్య ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా.. ఆడాలంటే తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి వచ్చింది ఈ సెర్బ్. అయితే.. తను వ్యాక్సిన్ వేయించుకోలేదని, తను సర్టిఫికెట్ ఇవ్వలేనంటూ స్పష్టం చేశాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఈ స్టార్ ఆటగాడికి ఆడటానికి అనుమతించలేదు. ఐసొలేషన్ టైమ్ లో తమ దేశంలో ఉండటానికి అనుమతించి, ఆ తర్వాత సాగనంపారు. ఈ విషయంపై ఆస్ట్రేలియన్ కోర్టుకు వెళ్లినా ఇతడికి ఊరట దక్కలేదు!
దీంతో ఛాంపియన్ గా నిలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నా జొకొవిచ్ అక్కడ నుంచి తిరుగుముఖం పట్టాడు. అంతటితో అయిపోలేదు.. ఇతడు పాల్గొనాల్సిన తదుపరి టోర్నీలకు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరి నియమం ఉండనే ఉంది. యూఎస్ ఓపెన్లో పాల్గొనాలన్నా, కనీసం అమెరికాలో అడుగుపెట్టాలన్నా కూడా ఈ సెర్బియన్ కచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
తను వ్యాక్సిన్లకు వ్యతిరేకం కాదు అని అంటున్న జోకర్, అయితే తన శరీరంలోకి పొడిపించుకునే ఈ వ్యాక్సిన్ విషయం పై మాత్రం తనకు స్వతంత్రం ఉండాలని అంటున్నాడు. తనకు ఇష్టమైతే వేయించుకుంటానంటున్నాడు. అంతే కానీ, నియమాలనుసారం తను వ్యాక్సిన్ వేయించుకోనంటూ కుండబద్ధలు కొడుతున్నాడు. మరి మిగతా ప్రపంచం ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ నియమాలను సడలించే లేదు! రానున్న రోజుల్లో కూడా వ్యాక్సినేషన్ జరిగి ఉండాలనే నియమాన్ని తప్పనిసరిగా అమలు చేసేలా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జోకర్ టెన్నిస్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేకపోలేదు!
తను టెన్నిస్ టోర్నీల నుంచి తప్పుకోవడానికి రెడీ కానీ, వ్యాక్సిన్ విషయంలో తనకున్న అభిప్రాయానికి అనుగుణంగా మాత్రం తగ్గేదేలా.. అని జొకొవిచ్ స్పష్టం చేస్తున్నాడు! దీని వల్ల కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఈ టెన్నిస్ ప్లేయర్ కోల్పోతున్నాడనేది మాత్రం వాస్తవం. అయినా తను అనుకున్న దానికి ఇతడు కట్టుబడి ఉండటం ఇతడి వ్యక్తిత్వాన్ని మరో మెట్టు పైకెక్కిస్తోంది!