బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రాంతీయ పార్టీల అధినేత మద్దతు లభిస్తుందా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఉన్నట్టుండి బీజేపీ వ్యతిరేక స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు కేసీఆర్. అయితే ఇప్పటి వరకూ అది ఢిల్లీలో మార్మోగలేదు.
ఎవరైనా ఉత్తరాదిన చోటామోటా పార్టీ అధినేత బీజేపీపై ఇలా విరుచుకుపడి ఉంటే, అది జాతీయ వ్యాప్తంగా చర్చను చేసేది ఉత్తరాది మీడియా. ఒక సౌత్ ఇండియన్ స్టేట్ సీఎం గట్టిగా మాట్లాడుతున్నా, ఆ వాయిస్ రైజ్ కావడం లేదు. ఇదీ దక్షిణాదికి అంశాలు జాతీయ స్థాయిలో చర్చకు నోచుకునే తీరుకు నిదర్శనం!
ఆ సంగతలా ఉంటే.. కేసీఆర్ మరోసారి పక్క రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్నట్టుగా ప్రకటించేశారు ఇప్పటికే. గతంలో 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు మూడో కూటమి అంటూ కేసీఆర్ హడావుడి చేశారు. బెంగళూరుకు వెళ్లి జేడీఎస్ వాళ్లతో సమావేశం, ఇక మమత వంటి వారితో సమావేశం అయ్యారు. అయితే తీరా కేసీఆర్ మాటలు కార్యరూపం వరకూ రాలేదు. మమత అప్పుడు కాంగ్రెస్ కూటమితోనే జట్టు కట్టింది. జేడీఎస్ ఎటూ దూకలేక సోలోగా పోటీ చేసి చిత్తయ్యింది.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ వారితోనే సమావేశాలు పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. మమత, దేవేగౌడ వంటి వాళ్లతో పాటు ఉద్ధవ్ ఠాక్రేను కూడా కేసీఆర్ కలుస్తారట. వీరి మద్దతుతో బీజేపీపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తారట కేసీఆర్.
మరి వీరితో కేసీఆర్ మూడో కూటమి అంటారో, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా సరే అంటారో! ఇప్పటికే దేవేగౌడ నుంచి కేసీఆర్ కు ఫోనొచ్చిందట. కర్ణాటకలో బీజేపీ చేస్తున్న మత రాజకీయాన్ని జేడీఎస్ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ బీజేపీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో… కేసీఆర్ కు ఫోన్ చేశరాట దేవేగౌడ. బీజేపీ వ్యతిరేక పోరాటంలో తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ తో అన్నారట దేవేగౌడ.