కామెడీ షోల జడ్జిగా నాగబాబు సుపరిచితుడే. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో జడ్జిలుగా నాగబాబు, మంత్రి ఆర్కే రోజా జంట చాలా కాలం పాటు ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత షో నుంచి నాగబాబు తప్పుకుని, మరో చానల్లో ప్రసారమయ్యే కామెడీ కార్యక్రమానికి న్యాయమూర్తిగా వ్యవహరించారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా కూడా జబర్దస్త్ నుంచి గౌరవంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
బుల్లితెరపై కామెడీ ప్రదర్శనలకు సంబంధించి జడ్జిగా వ్యవహరిస్తూ తన నోటికొచ్చిందేదో నాగబాబు చెప్పేవారు. ప్రేక్షకులు భరించారు. తాజాగా ఆయన రాజకీయ తెరపై మాత్రం కామెడీ యాక్టర్‌గా అద్భుతంగా రాణిస్తున్నారు. నాగబాబు రాజకీయ అభిప్రాయాలు నవ్వు తెప్పించిన సందర్భాలే ఎక్కువ. మార్గదర్శి ఫైనాన్ష్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం విచారిస్తుంటే నాగబాబుకు ఆ వ్యవహారం తప్పుగా కనిపించింది. దీంతో రామోజీరావు గొప్పతనాన్ని ఆకాశమే హద్దుగా ప్రశంసిస్తూ నాగబాబు ఏవేవో చెప్పుకొచ్చారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై విషం కక్కిన రామోజీరావుపై ఎందుకంత ప్రేమ అంటూ జనసేన కార్యకర్తలు తమదైన రీతిలో నిరసన ప్రకటించారు.
తాజాగా మరోసారి నాగబాబు కామెడీ చేశారు. టీటీడీపై నాగబాబు విమర్శలు గుప్పించే క్రమంలో నాగబాబు చేసిన హాస్యం అందరిలో నవ్వు పుట్టిస్తోంది. ‘టీటీడీలో తప్పకుండా పారదర్శకత ఉండాలి. టీటీడీ నిర్వహణలో జవాబుదారీతనం తప్పనిసరి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అయిన మరుక్షణమే టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, అత్యధిక మంది భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం. ఇంతకాలం కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి అనేది ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తాం’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.
చంద్రబాబునాయుడిని సీఎం చేస్తాన్రా బాబూ అంటూ పవన్‌కల్యాణ్ నెత్తీనోరూ కొట్టుకుని మరీ చెబుతున్నారు. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి వీరమరణం పొందలేనని పవన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. నాగబాబు మాత్రం పవన్‌కల్యాణ్ సీఎం కాగానే అంటూ ఎవరిని మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారనే నిలదీతలు ఎదురవుతున్నాయి.
చంద్రబాబునాయుడిని సీఎం చేస్తాననడంలో రెండో మాటకే చోటు లేదని స్వయంగా పవన్‌కల్యాణే చెబుతున్నారని, అలాంటప్పుడు నాగబాబు నోట ఇవేం మాటలంటూ నెటిజన్లు తూర్పారపడుతున్నారు. గతంలో వివిధ కామెడీ షోలకు జడ్జిగా పని చేసిన నాగబాబు… ఆ పాత్రలో విసుగెత్తి హాస్య నటుడిగా సరికొత్త అవతారం ఎత్తారని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. ఇవేం కితకితలు నాగబాబు అంటూ ఆయన్ను ఆట పట్టిస్తున్నారు.