మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయాడు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన మళ్లీ జైలుపాలయ్యాడు. వివేకాకు ఎర్రగంగిరెడ్డి అత్యంత సన్నిహితుడు. అలాంటి వ్యక్తే వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసింది. ఈ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందంటూ కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ అరెస్ట్ మాత్రం కాలేదు. అవినాష్‌రెడ్డి న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదిలా వుండగా వివేకా హత్యకు గురైన రోజే ఎర్రగంగిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ విచారణ చేపట్టింది. మొత్తం 72 సార్లు ఆయన్ను సీబీఐ విచారించింది. అయితే వివేకా హత్య తర్వాత దాదాపు రెండు వారాలకు ఎర్రగంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు చూపారు.
మూడు నెలల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. మూడు నెలలు గడిచినా ఎర్రగంగిరెడ్డిపై చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో 2019, జూన్ 27న ఎర్రగంగిరెడ్డికి పులివెందుల కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి ఆయన పులివెందులలో దర్జాగా తిరుగుతున్నారు.
విచారణ బాధ్యతల్ని సీబీఐ చేపట్టిన తర్వాత ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని న్యాయపోరాటానికి దిగింది. అయినప్పటికీ న్యాయస్థానాలు కింది కోర్టు నిర్ణయాన్నే సమర్థిస్తూ వచ్చాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై కీలక ఆదేశాలు ఇచ్చింది.
బెయిల్ రద్దు చేస్తూ, మే5వ తేదీలోపు న్యాయస్థానంలో లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎర్రగంగిరెడ్డి ఇవాళ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. జూన్ 2వ తేదీ వరకూ ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరడం గమనార్హం.