తన ప్రత్యర్థి ఏదైనా ప్రజలకు మంచి చేసే ఆలోచనలో ఉంటే.. తద్వారా ప్రజల్లో కీర్తి సంపాదించుకునే అవకాశం ఉంటే.. తాను ముందే ఆ పనిని చేసేసి ఆ మైలేజీ కొట్టేయాలనే కక్కుర్తి కొందరికి ఉంటుంది. అలాంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తప్పకుండా ఉంటారు.
పాదయాత్ర సందర్భంగా వృద్ధాప్య పెన్షన్లను రెండువేలు చేస్తానని జగన్ ప్రకటిస్తే.. హడావుడిగా ఎన్నికలకు ముందు రెండువేలకు పెంచేసి.. కపటనాటకాలాడిన వ్యక్తి చంద్రబాబునాయుడు. దానికి విరుగుడుగా జగన్ పెన్షనును తాను మూడువేలు చేస్తానంటూ ప్రజలకు మాట ఇచ్చి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే దానిని నిలబెట్టుకుంటున్నాడు. అందరూ తనలాంటి వంకరబుద్ధులవాళ్లే ఉంటారని చంద్రబాబుకు ఒక అభిప్రాయం ఉన్నట్టుంది. అందుకే ఆయన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతూ ఉండగా.. అదంతా తనన చూసి భయపడి చేస్తున్నారంటూ.. వంకర డైలాగులు సంధిస్తున్నారు.
ఏపీలో అకాల వర్షాలు రైతాంగాన్ని దెబ్బతీశాయి. దాదాపుగా రాష్ట్రంలో ప్రతిచోటా కూడా రైతులు పంట నష్టపోయారు. తడిచిన ధాన్యం మొత్తం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశించారు. అధికారులు కూడా అదే విషయం ప్రకటిస్తున్నారు. ఆ మేరకు కొనుగోళ్లు చేస్తున్నారు.
అయితే చంద్రబాబునాయుడు ఇక్కడే కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నారు. రైతుల దీనస్థితిని పరిశీలించడానికి అంటూ చంద్రబాబునాయుడు గోదావరి జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ ప్రాంతంలో పర్యటనలు చేస్తోంటే.. ఆ ప్రాంతంలో ప్రభుత్వం హడావుడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నదంటూ చెప్పుకొచ్చారు. అంటే.. చంద్రబాబును చూసి భయపడి, ప్రభుత్వం ధాన్యం కొంటున్నదట!
ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం ధాన్యం కొనాలంటే.. తాను ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తానని ఆయన చెప్పుకుంటున్నారు. అక్కడికేదో ఆయన రాకకు జడిసి ప్రభుత్వం ధాన్యం కొంటున్నట్టు డప్పు కొట్టుకుంటున్నారు. అయినా నష్టపోయిన రైతులకు అండగా ఉంటానంటున్న చంద్రబాబు ఏం చేస్తారు? పార్టీ తరఫున వారికి ఏమైనా ఆర్థిక సాయం అందిస్తారా? అనేది మాత్రం చెప్పడం లేదు.
ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కూడా అంతే. జనసేన సొంత డబ్బుతో రోడ్లు రిపేర్లు అంటూ కామెడీ ఎపిసోడ్ నడిపించిన పవన్ కల్యాణ్.. తాను పర్యటించే ప్రాంతాల్లో రోడ్లు రిపేర్లు చేసేస్తున్నారంటూ అప్పట్టో ప్రల్లదనాలకు పోయారు. ఇప్పుడు చంద్రబాబు ధాన్యం కొనుగోళ్ల గురించి చెబుతున్న మాటలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ ది కూడా తన లాంటి వంకర బుద్ధి అని చంద్రబాబు అనుకోవడం ప్రజలకు కామెడీగా కనిపిస్తోంది.