ఎమ్మెల్యే రాపాక నోటి తుత్త‌ర‌.. ఏమైందంటే!

డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ నోటి తుత్త‌ర కొత్త స‌మ‌స్య‌ని తీసుకొచ్చింది. బాధ్య‌తాయుత మైన ప‌దవిలో ఉన్నామ‌న్న క‌నీస స్పృహ లేకుండా, నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడి…

డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ నోటి తుత్త‌ర కొత్త స‌మ‌స్య‌ని తీసుకొచ్చింది. బాధ్య‌తాయుత మైన ప‌దవిలో ఉన్నామ‌న్న క‌నీస స్పృహ లేకుండా, నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడి కోరి ఇబ్బందులు తెచ్చుకున్నారు. బ‌హిరంగంగా ఎలాంటి విష‌యాలు మాట్లాడ‌కూడ‌దో రాపాక‌కు ఇప్పుడు అనుభ‌వంలోకి వ‌చ్చింది. దొంగ ఓట్ల‌పై రాపాక నోరు జారి ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు విచార‌ణ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

ఈ ఏడాది మార్చి 24న అంత‌ర్వేదిలో వైసీపీ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో రాపాక ప్ర‌సంగిస్తూ తాను ప్ర‌తిసారి దొంగ ఓట్లు వేయించు కుంటున్న‌ట్టు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ రోజు ఆయ‌న ఏమ‌న్నారంటే… “పూర్వం నుంచి మా స్వ‌గ్రామం చింత‌ల‌మోరికి దొంగ ఓట్లు వేయ‌డానికే కొంద‌రు వ‌చ్చేవారు. ఒక్కొక్క‌రు ఐదు, ప‌ది ఓట్లు వేసేవాళ్లు. ఆ ఓట్లు నా గెలుపులో కీల‌క పాత్ర పోషించేవి” అని అన్నారు. రాపాక వ్యాఖ్య‌లు తీవ్ర రాజ‌కీయ దుమారం రేపాయి.

మాంసం తింటున్నామ‌ని ఎముక‌లు మెడ‌లు వేసుకున్న చందంగా రాపాక వ్య‌వ‌హార శైలి వుంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. రాపాక వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి గ‌త నెల 24న ఫిర్యాదు అందింది. దీంతో విచార‌ణ‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్‌కుమార్ మీనా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. 

వ‌ర‌ప్ర‌సాద్ ఎన్నిక‌పై వారంలోపు విచారించి క‌లెక్ట‌ర్ హిమాన్షుశుక్లా నివేదిక స‌మ‌ర్పించాల్సి వుంది. స‌మ‌స్య‌ల్ని కొని తెచ్చుకోవ‌డం అంటే ఇదేన‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.