టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేయగలరా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. అమరావతి రాజధాని మీద ప్రభుత్వం వేసిన సిట్ విషయంలో న్యాయపరమైన ఊరట లభించి ఉండవచ్చు కానీ బాబుని అరెస్ట్ చేయడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబుని అరెస్ట్ చేయడం వైసీపీ సర్కార్ వల్ల కాదని గంటా అంటున్నారు. సిట్ విచారణ మొదలైతే మాత్రం రెండు మూడు రోజుల వ్యవధిలోనే అరెస్టులు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన నేపధ్యంలో గంటా చేస్తున్న సవాల్ ఆలోచింపచేస్తోంది.
అమరావతిలో లెక్కలేనన్ని దుర్మార్గాలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని బొత్స ఆరోపిస్తున్నారు. ఒక్కోటీ సిట్ లో బయటకు వస్తాయని అంటున్నారు. అమరావతి రాజధాని ల్యాండ్ స్కాం అన్నది దేశంలోనే పెద్దదని అంటున్నారు.
తప్పు ఎవరు చేసినా శిక్షించడం విధానం. అదే రాజ్యాంగం చెబుతోంది. ఎంతటి పెద్ద వారు అయినా తప్పు చేశారా లేదా అన్నదే చూస్తారు తప్ప ఇతర అంశాలు ఆలోచిస్తారా. గంటా పొలిటికల్ గా రీ యాక్టివ్ అయ్యారు. రోజూ ప్రెస్ మీట్ పెడుతున్నారు. బాబుని అరెస్ట్ చేసుకోండి చూద్దామని వైసీపీ నేతలకే సవాల్ విసురుస్తున్నారు.
అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలు కనుక దీన్ని సీరియస్ గా తీసుకుంటే జరిగేది సంచలనమే. రాజకీయాల్లో ఏదీ ఆసాధ్యం కాదు. భూ కుంభకోణాలకు భూ దందాలకు పాల్పడిన వారిని అరెస్టులు తప్పకుండా చేస్తామని వైసీపీ మంత్రులు చెబుతూంటే చంద్రబాబు అరెస్ట్ ని తమ్ముళ్ళే ముందుకు తెస్తున్నారు అంటే ముందే రాజకీయంగా ఈ ఇష్యూని డైవర్ట్ చేసే యత్నమా లేక మైండ్ గేమా లేక బాబుని ముందు పెట్టి సిట్ విషయంలో వైసీపీకి కళ్ళెం వేసే ప్రయత్నమా అన్నదే ఒక పెద్ద బిగ్ డిబేటబుల్ పాయింట్.