Advertisement

Advertisement


Home > Politics - Gossip

కమలంలో ముసలం బయట పడుతోంది!

కమలంలో ముసలం బయట పడుతోంది!

తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా తమ పార్టీని బలోపేతం చేయాలనే కమలదళం  ప్రయత్నాల్లో వారికి ఉన్న బలహీనతలన్నీ బయటపడుతున్నాయి.

క్రమశిక్షణ గల పార్టీగా తమ గురించి తాము డప్పు కొట్టుకునే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగంలో, నాయకుల మధ్య ఎన్ని రకాల అంతర్గత విభేదాలు ఉన్నాయో? ఏ స్థాయిలో వారు ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నారో? తాజా పరిణామాలను గమనిస్తే అర్థమవుతోంది.

ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సపరివార సమేతంగా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో పార్టీలోని లుకలుకలు బయటకు వస్తున్నాయి.

ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి తెలంగాణ గద్దెపై కమల వైభవం నిరూపించుకోవాలని బిజెపి ఉవ్విళ్ళూరుతోంది. అయితే రాష్ట్ర పార్టీ నాయకులు కేసీఆర్ ను  నిత్యం తిట్టిపోస్తూ ఎంతగా రెచ్చిపోతున్నప్పటికీ.. వారికి ప్రజాక్షేత్రంలో ఓట్లుగా మారగల బల సంపత్తులు తక్కువే అన్నది అనేకమంది అంచనా.

గెలవగల సీట్లు అధికారానికి సరిపడా ఉండవు అని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి ఇబ్బడి ముబ్బడిగా నాయకులను వలసలకు ప్రేరేపించి తమ పార్టీలో కలుపుకోవాలని బిజెపి అనుకుంటోంది.

ప్రత్యేకంగా అందుకోసం చేరికల కమిటీ అంటూ ఈటల రాజేందర్ సారథ్యంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ‘పార్టీ బలోపేతం’ అనే టాగ్ లైన్ కింద ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా ఆహ్వానించి కాషాయ కండువా కప్పేయడానికి ఈటెలకు స్వేచ్ఛ ఉన్నదా అంటే అనుమానమే.

సంస్థాగతంగా పార్టీకి పెద్దగా బలం లేని  ఖమ్మం జిల్లాలో కీలకమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈటెల నేతృత్వంలో బిజెపి కీలక నాయకులు బృందంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సహా ఆయన సూచనల మేరకు కోరినంతమంది అనుచరులకు కూడా టికెట్లు ఇచ్చే అంశమే చర్చల్లో కీలకంగా మారింది.

పొంగులేటి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు అయినప్పటికీ పాలమూరు జిల్లా నుంచి మరో బహిష్కృత గులాబీ నాయకుడు జూపల్లి కృష్ణారావు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. కమల నేతలు ఇంతగా చర్చలు సాగించినా, పొంగులేటి మాత్రం తన నిర్ణయం చెప్పలేదు.. అంటే బేరం ఇంకా ఫైనల్ కాలేదని అర్థమవుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే, బిజెపిలో వర్గ విభేదాలు ఈ సందర్భంగా బయటపడుతున్నాయి. టీం మొత్తం ఖమ్మం వెళ్ళిన తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్-- పొంగులేటిని తమ పార్టీలోకి  ఆహ్వానిస్తున్న సంగతి తనకు తెలియనే తెలియదంటూ ఒక పుల్లవిరుపు మాట అన్నారు.

అదే సమయంలో ఈటల రాజేందర్ కూడా ఆత్మ రక్షణ మార్గం ఎంచుకోవాల్సి వచ్చింది. బండి సంజయ్ ను బైపాస్ చేస్తున్నట్లుగా-- ‘అమిత్ షా ఆదేశాలతోనే ఆహ్వానించడానికి ఖమ్మం వచ్చినట్లుగా’ ఆయన ప్రకటించారు.

ఇవన్నీ కూడా బిజెపిలో ఒకరిపై ఒకరు అధిపత్యం ప్రదర్శించుకోవడానికి చేస్తున్న  ప్రయత్నాలే! అధికారం ఇంకా దక్కనే లేదు అప్పుడే ఇలాంటి ముఠా కొట్లాటలతో వారు ఎందుకు బజారున పడుతున్నారో అర్థంకాని సంగతి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?