ఎర అంటే ప్యాకేజీ అనుకోవచ్చా పవన్ గారూ..?

“ఎర” అంటే ఏంటి..? ఎరను ఆహారంగా భ్రమపడి ఆశపడ్డ జాతి ఏది..? ఆ జాతి వేటగాళ్లకు చిక్కడం ఖాయమేనా..? పవన్ కల్యాణ్ ట్వీట్ చూస్తే ఈ ప్రశ్నలు మొదలవుతాయి. “ఎర”ను ఆహారం అనుకుని ఆశపడే…

“ఎర” అంటే ఏంటి..? ఎరను ఆహారంగా భ్రమపడి ఆశపడ్డ జాతి ఏది..? ఆ జాతి వేటగాళ్లకు చిక్కడం ఖాయమేనా..? పవన్ కల్యాణ్ ట్వీట్ చూస్తే ఈ ప్రశ్నలు మొదలవుతాయి. “ఎర”ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతి జాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది. ఇదీ పవన్ వేసిన ట్వీట్. 

ఇందులో ఎర అంటే ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలే అనుకోవాలి. వేటగాళ్లు అంటే వైసీపీ నేతలేననేది పవన్ ట్వీట్ అంతరార్థం. సంక్షేమ పథకాలతో ప్రజలకు జగన్ ఎరవేస్తున్నారని, పాపం జనం మాత్రం దాన్ని ఆహారంగా భ్రమించి జగన్ చేతికి చిక్కుతున్నారనేది పవన్ పరోక్ష ఆరోపణ.

అంతా బాగానే ఉంది కానీ “ఎర” గురించి పవన్ మాట్లాడ్డమే ఏమాత్రం బాగోలేదు. అంతకుముందు బీజేపీ-టీడీపీ, ఆ తర్వాత బీఎస్పీ, వామపక్షాలు, మళ్లీ ఇప్పుడు బీజేపీ, భవిష్యత్తులో మళ్లీ టీడీపీ-బీజేపీ.. ఇలా పవన్ కల్యాణ్ ఎన్ని రకాల ఎరలకు చిక్కారనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ పాయింట్.

“ఎర” గురించి నువ్వే చెప్పాలి పవన్ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. ఎప్పటికప్పుడు ప్యాకేజీలకు అమ్ముడుపోయే పవన్ “ఎర” గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటున్నారు. ఇంతకీ “ఎర” అంటే ప్యాకేజీయేనా పవన్ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

ఏపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు రకరకాలుగా ఇరుకున పెట్టాలని చూస్తున్నా అది సాధ్యం కావడంలేదు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఆగకపోవడం వైరివర్గాలకు కంటగింపుగా మారింది. ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలనుకున్నా కుదరకపోవడంతో సంక్షేమ పథకాలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజలు “ఎర”లకు పడిపోతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు పవన్ కల్యాణ్. ప్రజల్ని పవన్ మరీ అంత తక్కువ అంచనా వేస్తే ఎలా..? నిజంగానే “ఎర”లకు పడిపోయేవారైతే పసుపు-కుంకుమ డబ్బులకే ఏపీ ప్రజలు లొంగిపోయేవారు కదా. అది జరగలేదంటే జనం విశ్వసనీయతపై నమ్మకం పెట్టుకున్నారని అర్థం. 

జనం కూడా తనలాగే ప్యాకేజీలకు పడిపోతారని పవన్ భ్రమించినట్టున్నారు. అందుకే వాకాడ శ్రీనివాసరావు కొటేషన్ అర్జంట్ గా ఆయనకు గుర్తొచ్చింది. కానీ ప్రజలు పవన్ లాగా ప్యాకేజీలకు పడిపోయే టైపు కాదు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్యాకేజీలు కావు, ఎరలూ కావు.

సమయం దొరికితే ప్రజల్ని తిట్టడమేనా?

సమయం దొరికితే ప్రజల్ని ఇలా ఆడిపోసుకోవడం పవన్ కల్యాణ్ కు కొత్తేం కాదు. మొన్నటికిమొన్న తనకు ఓటేయనందుకు విశాఖ వాసుల్ని చెడామడా తిట్టేశారు జనసేనాని. ఆ తర్వాత మరో సభలో జగన్ ను గెలిపించుకొని, నా దగ్గరకు ఎందుకొస్తారంటూ ఆక్రోషంగా మాట్లాడారు. మరో సభలో మాట్లాడుతూ.. కనీసం తనను గెలిపించినా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడేవాడినంటూ తెగ ఇదైపోయారు. 

ఇలా సమయం, సందర్భం దొరికిన ప్రతిసారి ప్రజల్ని తిడుతున్న పవన్.. ఈసారి ఏకంగా ఏపీ ప్రజలు ఎరకు పడిపోయారంటూ ట్వీట్ చేసి, తన సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నారు.