డ్రగ్స్ తీసుకున్న సెలబ్రిటీలు తెలివి మీరారు..!

డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ ల వ్యవహారంలో కొన్ని లొసుగులున్నాయి. చట్టంలోని ఆ లొసుగుల్ని ఉపయోగించుకుని టాలీవుడ్ ప్రముఖులు అరెస్ట్ ల నుంచి తప్పించుకున్నారు. గతంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కూడా డ్రగ్స్ తీసుకున్న టాలీవుడ్…

డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ ల వ్యవహారంలో కొన్ని లొసుగులున్నాయి. చట్టంలోని ఆ లొసుగుల్ని ఉపయోగించుకుని టాలీవుడ్ ప్రముఖులు అరెస్ట్ ల నుంచి తప్పించుకున్నారు. గతంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కూడా డ్రగ్స్ తీసుకున్న టాలీవుడ్ ప్రముఖుల్ని బాధితులుగా గుర్తించి వదిలిపెట్టింది. 

విచారణకు పిలిపించింది కానీ క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ వ్యవహారం అక్కడితో ఆగలేదు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఈడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. కెల్విన్ తో జరిపిన నగదు లావాదేవీల లిస్ట్ ఇవ్వాలంటూ తెలంగాణ ఎక్సైజ్ శాఖను కోరింది.

అయితే ఆ లిస్ట్ ఇస్తే.. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు కచ్చితంగా బయటకొస్తాయి. డ్రగ్స్ కొన్నదెవరు, తీసుకున్నదెవరు, స్నేహితులకు ఇచ్చిందెవరు, పార్టీలు చేసుకున్నదెవరు అన్నీ బయటకు రావాల్సిందే. దీంతో ఎక్సైజ్ శాఖ కాస్త ముందూవెనకాడుతోంది.

సెక్షన్ 64-ఎ.. శ్రీరామరక్ష..

మాదక ద్రవ్యాల నిరోధక చట్టం NDPS లోని సెక్షన్ 64-ఎ ప్రకారం టాలీవుడ్ ప్రముఖులు ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. డ్రగ్స్ వినియోగదారుల్ని బాధితులుగా గుర్తిస్తూ వారికి విచారణ నుంచి మినహాయింపునిచ్చే సెక్షన్ అది. 

మాదక ద్రవ్యాలకు బానిసై, ఆ తర్వాత ఏదైనా ప్రభుత్వ లేదా, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందామని సర్టిఫికెట్ చూపిస్తే వారిపై విచారణ జరపరు. దీన్ని అడ్డు పెట్టుకుని ఈ కేసుతో సంబంధం ఉన్న 250మంది మినహాయింపు పొందినట్టు రికార్డులు చెబుతున్నాయి. అంటే వీరంతా ఆ సెక్షన్ వల్ల రిలాక్స్ గా ఉన్నారు. ఇప్పుడు ఈడీ లెక్కలు తీస్తుండేసరికి హడలిపోతున్నారు.

కాలే డేటా రికార్డులు ఇవ్వండి..

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇదివరలో నగదు లావాదేవీల రికార్డులు ఇవ్వాలని కోరింది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ ప్రముఖుల సెల్ ఫోన్ కాల్ డేటా రికార్డులు ఇవ్వాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ని కోరింది. గతంలో రాసిన లేఖకే ఇంకా సమాధానం ఇవ్వలేదు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్. 

కోర్టు ఆదేశాలిచ్చినా కదల్లేదు. దీంతో మరోసారి ఈడీ లేఖతో అయినా ఈ వ్యవహారం చర్చల్లోకి వచ్చే అవకాశముంది. కాల్ రికార్డులు ఈడీ చేతికి వెళ్తే, నగదు లావాదేవీల వ్యవహారం బయటపడితే.. టాలీవుడ్ ప్రముఖులు కేవలం బాధితులే కాదు, డ్రగ్స్ వ్యాపారులుగా ముద్రపడే అవకాశముంది. దీంతో మరోసారి టాలీవుడ్ వణికిపోతోంది.