ఏపీ బీజేపీకి సొంత పార్టీ నాయకులే శాపమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా బలపడాలని చూస్తున్న బీజేపీ, అందుకు తగ్గట్టు నాయకత్వ మార్పిడి, అలాగే అత్యంత జనాకర్షణ కలిగిన జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తు కుదుర్చుకున్నా ఆశించిన స్థాయిలో పార్టీ బలపడలేదు. మున్ముందు బలపడుతుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఏదో ఒక అంశంపై పార్టీ ముఖ్య నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అవి రాజకీయంగా బాగా నష్టం కలిగించడం చూస్తున్నాం.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆవేశం తప్ప ఆలోచన ఉన్నట్టు లేదు. మద్యంపై ఆయన హామీ, అలాగే మనుషులను చంపుకునే కడప జిల్లా వాసులకు విమానాశ్రయం ఇచ్చామని నోరు జారి వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగాను అభాసుపాలయ్యారు. చివరికి క్షమాపణలతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
బీజేపీకి నష్టం కలిగించే జాబితాలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేరారు. ప్రత్యేక హోదాపై రోజుకో మాట, పూటకో మాట చెబుతూ జీవీఎల్ శక్తివంచన లేకుండా తన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ తన ఎజెండాలో ప్రత్యేక హోదా చేర్చగా, దాన్ని తానే పక్కన పెట్టించానని జీవీఎల్ చెప్పడం ద్వారా ఏం సాధించారో తెలియదు కానీ, బీజేపీకి కావాల్సినంత నష్టాన్ని మాత్రం మిగిల్చారు.
అసలే ఒక్క శాతం ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీకి, అంతకంటే తగ్గించకూడదనే ప్రయత్నంలో భాగంగా జీవీఎల్ నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించడానికి, ఆచరణాత్మక మార్గాలను పరిశీలించడానికి, అలాగే సిఫార్సు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని కోరుతూ జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు లేఖ రాశారు. కానీ ఏం లాభం …అంతకు ముందు జీవీఎల్ చేసిన ప్రకటనతో డ్యామేజీ జరిగిపోయింది.
వీరికి తోడు సీఎం రమేశ్, సుజనాచౌదరి. లంకా దినకర్, నాగభూషణం చౌదరి, రమేశ్‌నాయుడు ఎటూ ఉన్నారు. మనసులో మాత్రం చంద్రబాబుపై అభిమానం పెట్టుకుని, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో కొనసాగుతూ, టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్లతో ఏపీలో బీజేపీకి లాభం ఏంటి? గతంలో బీజేపీ ఎదగకపోవడానికి కేవలం ఒక్క నాయుడు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు బాష సినిమాలో రజనీకాంత్ డైలాగ్ చెప్పినట్టుగా… ఒక్క నాయుడు పోతే, వంద మంది అలాంటి వాళ్లు పుట్టుకొచ్చారు. ఇక ఇప్పట్లో ఏపీలో బీజేపీ బలపడడం అనే మాట కల్లే.