వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై అనుమానం అంటూనే, అదే నిజమని నమ్మేలా సీబీఐ అధికారులు చార్జిషీట్‌ను రూపొందించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసే అంశం. ఎందుకంటే హతుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సొంత చిన్నాన్న.
సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్నట్టు అనుమానితుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వరుసకు తమ్ముడు. దీంతో ఎటు చూసినా… ఈ కేసు జగన్ రాజకీయ భవిష్యత్‌పై చెరగని ముద్ర వేస్తుంది. అది మాయని మచ్చనా లేక మరొకటా అనేది సీబీఐ దర్యాప్తుపై ఆధారపడి వుంటుంది.
2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకా హత్యకు గురయ్యాడు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట జరిగిన ఈ హత్య ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. తన చిన్నాన్నను టీడీపీ నేతలే అంతమొందించారని, సీబీఐ దర్యాప్తు చేయించాలని నాడు ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అప్పట్లో గవర్నర్‌ను కూడా కలిసి విన్నవించారు. అనంతరం తన చిన్నమ్మ సౌభాగ్యమ్మ, చెల్లి డాక్టర్ సునీతతో కలిసి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. కేసు వాస్తవాలేంటో జగన్‌కే తెలియాలి. కానీ సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు నుంచి ఆయన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. హైకోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. విచారణలో భాగంగా గత ఏడాది అక్టోబర్ 10న సీబీఐ తొలి చార్జిషీట్, గత నెల 31న మరొకటి కోర్టుకు సమర్పించింది. చివరిగా సమర్పించిన చార్జిషీట్‌కు సంబంధించి వివరాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
వివేకా గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ స్పష్టం చేసింది. అంతేకాదు, అవినాశ్‌రెడ్డిపై మరికొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ… ఈ హత్య కేసులో అతను కూడా నిందితుడే అని సీబీఐ చెప్పకనే చెప్పింది. తాజా సీబీఐ చార్జిషీట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా ఉంది. మరీ ముఖ్యంగా వైసీపీకి రాజకీయంగా ఇది ఎదురు దెబ్బే. ఎందుకంటే తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, మరో చిన్నాన్న మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్లను వివేకా కుమార్తె డాక్టర్ సునీత పేర్కొన్న సంగతి తెలిసిందే.
సీబీఐ ప్రధానంగా హత్యకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించడాన్ని బట్టి చూస్తే… ఎవరైనా నిందితులు వారేనని నమ్మే అవకాశాలు లేకపోలేదు. ఈ హత్య కేసులో అవినాశ్‌రెడ్డిపై అనుమానం వ్యక్తం చేయడానికి సీబీఐ పేర్కొన్న ప్రధాన అంశం ఏంటంటే…
‘కడప ఎంపీ టికెట్ తనకు లేదా వైఎస్ షర్మిలకు లేదా వైఎస్ విజయమ్మకు దక్కాలని వివేకానందరెడ్డి గట్టిగా చెప్పేవారు. వైఎస్ అవినాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదనేది వివేకా భావన. ఈ నేపథ్యంలో… తనకు సన్నిహితుడైన డి.శంకర్‌రెడ్డితో అవినాశ్ రెడ్డే ఈ హత్య చేయించారనే అనుమానం ఉంది. ఈ కోణంలో ఇంకా దర్యాప్తు సాగుతోంది’ అని సీబీఐ తాజా చార్జిషీట్‌లో స్పష్టం చేసింది.
ఇదే వాదన అనధికారికంగా కడప జిల్లాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే ప్రజల్లో జరుగుతున్న చర్చనే చార్జిషీట్‌లో పేర్కొన్నారా లేక విచారణలో భాగంగా ఆధారాలు లభించాయా? అనేది నిర్ధారణ కాలేదు. కానీ రాజకీయంగా, సామాజికంగా బలమైన వ్యక్తి అయిన కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై ఇలా నిరాధార ఆరోపణ చేసే ధైర్యం సీబీఐకి ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ఒక ప్రశ్న.
సీబీఐ తానుగా వ్యక్తం చేసిన అనుమానం నేపథ్యంలో, ఆ కోణంలో లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మరోసారి సీబీఐ తన విచారణను మొదలు పెట్టింది. మున్ముందు వివేకా కేసులో మరెన్ని సంచలన విషయాలు బయటపడతాయోననే భయం మాత్రం వైసీపీలో ఉంది.