ప్రత్యేక హోదాకు బదులు, ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబునాయుడు అతి పెద్ద తప్పు చేశారు. ఒక రకంగా చంద్రబాబు అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుందని అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాన్ని దబాయించారు.
ప్రత్యేక హోదా కలిగిన ఫలానా రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయని ప్రతిపక్షాన్ని ప్రశ్నించి, నిలదీసి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. తనను పదవీచ్యుతుడిని చేసిన ప్రత్యేక హోదాపై బాబు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తిరస్కరించిన ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాకూడదనే పట్టుదలలో చంద్రబాబు ఉన్నట్టు ఆయన మాటలు తెలియజేస్తున్నాయి.
ఇదే సందర్భంలో ప్రత్యేక హోదా సాధన కోసం జగన్‌ను చంద్రబాబు నిలదీయడం విచిత్రం. దీంతో చంద్రబాబుపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినట్టుగా, నేడు అదే హోదాలో ఉన్న మీరెందుకు చేయలేకపోతున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఏమన్నారంటే…
‘ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచే యుద్ధం ఎప్పుడు మొదలు పెడతారు. ప్రజలు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు పదేపదే చెప్పారు. ఇప్పుడెందుకు పోరాటం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గర్జించి, ఇప్పుడు కుక్కిన పేనులా ఉండటం దేనికి సంకేతం? ’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాధ్యత మరిచి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారనే నినాదంతో చంద్రబాబు ఎందుకు పోరాటం చేయలేకున్నారనేది ప్రధాన ప్రశ్న. చంద్రబాబు మాటల్లోనే చెప్పుకోవాలంటే… జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం గర్జించారు. చివరికి తన ఎంపీలతో రాజీనామా చేయించి చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి పెంచారు. జగన్ రాజకీయ వ్యూహంలో చిక్కిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి భారీగా నష్టపోయారు.
ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదాపై పోరాటం ఎందుకు చేయకూడదు? జగన్ ఏమైనా అడ్డుకుంటున్నారా? నాడు జగన్ చూపిన తెగువను నేడు చంద్రబాబు ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారనే ప్రశ్నకు సమాధానం ఏంటి? అసలు భయపడుతున్నది జగనా? చంద్రబాబా? ప్రత్యేక హోదాపై పోరాడేందుకు చంద్రబాబులో పిరికితనం ఎందుకు?