“తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు” – స్వామీ వివేకానంద.
ఇప్పుడు కాదు, ఈ మధ్య కాదు… గత ఇరవై ఏళ్లుగా గ్రేటాంధ్రా డాట్ కాం ను 2002 లో స్థాపించినప్పటి నుంచీ గమనిస్తూనే ఉన్నాను. నేడు మనస్ఫూర్తిగా నా కనిపించింది రాస్తున్నాను.
ఒక్కొసారి ఒక వ్యక్తి గొప్పతనం అదే స్థానంలో ఉన్న ఇతరులను చూస్తే తప్ప తెలియదు. తెలుగు సినిమారంగంలో ఎందరో స్టార్సున్నారు. వారిలో రాజకీయాల్లో ప్రయిత్నించినవారు, ప్రయత్నిస్తున్నవారూ ఉన్నారు.
పాత రోజుల్లోలా కాకుండా మీడియా విస్తరించిన నేటి రోజుల్లో ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా దాచుకోవడం అసంభవం. అందుకే గొప్పవాళ్లుగా కొలవబడ్డ చాలామంది నటులు తమ మాటల వల్ల చులకనైపోయారు, పోతున్నారు.
ఎంత ప్రతిభాపాటవాలున్నా, ఎంతటి జనాదరణ ఉన్నా మాటతీరు సరిగా లేకపోతే ఆ మనిషి విలువ అమాంతం పడిపోతుంది. పదాల్ని తూకమేసి మాట్లాడేవాడు, మాటల్లో వినయం, విధేయత చూపేవాడు ఎప్పటికీ ఆదర్శమవుతాడు.
ప్రస్తుతమున్న నటుల్లో మెగాస్టార్ చిరంజీవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ, అవమానాలు పొందినప్పుడు ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, మాట తూలతాడా తూలడా అన్న దాని మీదే వ్యక్తిత్వాన్ని నిర్వచించొచ్చు తప్ప కేవలం విజయాల్లో ఉన్నప్పుడు మాట్లాడే మాటల్ని బట్టి కాదు.
గుర్తున్నంతవరకు కొన్ని చెప్పుకోవల్సి వచ్చినప్పుడు….తెలుగు సినిమా వజ్రోత్సవాల వేళ మోహన్ బాబు మాట్లాడినదానికి చిరంజీవి కూడా ఆవేశంగా ప్రతిస్పందించినా అందులో ఒక ఆవేదన, ఒక సున్నితత్వం, నలుగురిలోనూ చులకన కాకుండా ఉండాల్సిన సినిమా పరిశ్రమ కీర్తిమీద మచ్చపడిందన్న బాధ కనిపించాయి తప్ప ఈర్ష్య, ద్వేషం, అసూయ, జుగుప్స, అకారణ క్రోధం కనపడలేదు.
తన చిన్నకుమార్తె విషయంలో టీవీ ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శించి వార్తలు ప్రసారం చేసినప్పుడు కూడా ఒక సగటు తండ్రిగా సున్నితమైన, భావోద్వేగమైన వీడియోని విన్నపం రూపంలో విడుదల చేసారు తప్ప తన స్టార్ పవర్ ని చూపిస్తూ పొగరు ప్రదర్శించలేదు.
పీఆర్పీ పెట్టి అపజయం పొందినప్పుడు అనేకమైన అవమానాలు పొందినప్పుడు కూడా తన సహజమైన సున్నితత్వాన్ని తెచ్చిపెట్టుకున్న కరుకు మాటలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయలేదు.
2014 ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్ద లైన్లో నిలబడినప్పుడు ఆయన చేత ఎవరో లైన్ బ్రేక్ చేయించి ముందుకు తీసుకెళ్లారు. అప్పుడు లైన్లో నిలబడ్డ ఒక సామాన్యుడు ఆయనపై మీడియా కెమెరాలా సాక్షిగా గట్టిగా ప్రశ్నించి వెనక్కి వెళ్లి లైన్లో నిలబడమన్నాడు. చిరంజీవి నొచ్చుకున్నా హుందాగానే తప్పుని అంగీకరించి వెనక్కి వెళ్లి లైన్లో నిలబడ్డారు. ఒక సెలెబ్రిటీని నిలదీసి వెనక్కి వెళ్లేలా చేసినందుకు ఆ సామాన్య వ్యక్తిని ఆ స్పాట్లోనే అక్కడున్న జనం చప్పట్లు కొట్టి కొనియాడారు. చిరంజీవి మాత్రం ఆ సామాన్యుడికంటే సామాన్యుడిగా లైన్లో నిలబడి సంజాయిషీ చెప్పుకున్నారు తప్ప దర్పం చూపించలేదు.
సెలెబ్రిటీల్ని ఎందరో సామాన్యులు సోషల్ మీడియాలో ఎన్నో తిట్లు తిడుతుంటారు, వెక్కిరిస్తుంటారు. కానీ జాతీయస్థాయిలో గుర్తింపుగల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అకారణంగా తన స్థాయికి తగని చిల్లర కామెంట్లు ట్విట్టర్లో చేసిన సందర్భంలో కూడా ఇంటర్వ్యూల్లో ఆయన చేష్టల్ని సున్నితమైన మాటలతో ఖండించారు తప్ప ఎదురుదాడి చేసి తన స్థాయి తగ్గించుకోలేదు. పర్యవసానంగా ఆ ఎపిసోడ్ లో వర్మ కూడా బహుశా గిల్టీ ఫీలింగ్ తో సైలెంటైపోయారు. హుందాగా మందలిస్తే వర్మ నుంచి రెస్పాన్స్ లేదు. అలా కాకుండా నాగబాబు టైపు స్పందనకి మాత్రం వర్మ రెచ్చిపోయాడు. కనుక మందలింపులో కూడా హుందాతనముంటే ఎలా ఉంటుందో చిరంజీవి చూపించారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందు చిరంజీవి అంత వినయంగా మాట్లాడడం ఆయన ఫ్యాన్స్ కి నచ్చుండకపోవచ్చు. వారు తెరమీద చిరంజీవిని నిజ జీవితంలో కూడా చూడాలనుకోవచ్చు. కానీ సందర్భాన్ని బట్టి ఎక్కడెలా మాట్లాడాలో, ఎక్కడ ఎంత స్పందించాలో తెలుసినవాడు గౌరవింపబడతాడు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగత వివాదమున్న పోసాని కృష్ణమురళి కూర్చునే మీటింగులో తాను ఉండననకుండా, ఆర్ నారాయణమూర్తి ఎలా పిలిచినా తాను స్టారునన్న విషయం తలలో మోయకుండా సమంజసంగా స్పందించిన తీరు ప్రశంసనీయం.
గత ఇరవై ఏళ్లను వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా చిరంజీవి అసందర్భంగా, అనవసరంగా, అహంకారంగా, అతిగా, అస్తవ్యస్తంగా, అసాంఘికంగా, అసహ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఈ విశేషణాలతో మాట్లాడే ఇతర నటులు చాలామందున్నారు. వారి పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. విశేషణం చెబితే చాలు ఆయా నటులు గుర్తుకొచ్చేస్తారు.
వ్యక్తిత్వ వికాసంలో మాటతీరు విషయంలో చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆయన ఇదే గుణాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుంటూ మరింత ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ..
– వెంకట్ ఆరికట్ల, సంపాదకుడు