ఏలూరులో కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఆ అంతు చిక్కని వ్యాధి ఏంటో ఇంకా నిర్ధారణ కాకుండానే, రోగులు కోలుకోవడంతో సమాజం ఊపిరి పీల్చుకుంది. అయితే అంతుచిక్కని వ్యాధిని సాకుగా తీసుకుని వైసీపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు బురద చల్లడం మాత్రం మానుకోలేదు.
ఇది రోజురోజుకూ మరింత పెరుగుతున్నదే తప్ప అసలు తగ్గడం లేదు. అంతుచిక్కని వ్యాధి ఏలూరు ప్రజల్ని మాత్రమే భయపెడుతుంటే, ప్రతిపక్షాల అంతుచిక్కని ద్వేషం రాష్ట్ర ప్రజల్ని వేదనకు గురిచేస్తోందని చెప్పొచ్చు.
అసలే అంతుచిక్కని వ్యాధితో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న జనానికి జీవితంపై భరోసా కల్పించేలా పాలకప్రతిపక్ష పార్టీలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. ప్రజల యోగక్షేమాలు గాలికొదిలేసిన ప్రతిపక్షాలు , తమకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టు రాజకీయ విమర్శలకు పాల్పడుతున్నాయి.
సీఎంకు చంద్రబాబు రాసిన లేఖను ఒకసారి పరిశీలిద్దాం. అందులో ఏముందంటే… “సాధారణంగా ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రభుత్వం నుంచి యుద్ధప్రాతిపదికన ఉపశమన చర్యలను, సహాయక కార్యక్రమాలను ప్రజలు ఆశిస్తారు. ఏలూరులో గానీ, పరిసర ప్రాంతాల్లో గానీ ఆ దిశగా చర్యలు లేవు” అని చంద్రబాబు విమర్శించారు. ఇంకా ప్రభుత్వంపై అనేక విమర్శలు ఆయన చేశారు.
జనసేనాని పవన్‌కల్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో కూడా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఆయన బాధ ఏంటో తెలుసుకుందాం.
“ఏలూరులో ప్రజల అస్వస్థతపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. బాధితులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రిలో చిన్నపిల్లలకు ఐసీయూ వార్డు లేకపోవడం శోచనీయం. 500 పడకల జిల్లా ఆస్పత్రిలో న్యూరో ఫిజీషియన్ లేకపోవడం బాధ కలిగిస్తోంది. కలుషిత నీరే వ్యాధికి కారణంగా భావిస్తున్నందున బాధిత ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీళ్లను ఎందుకు సరఫరా చేయడం లేదు” అని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతల విమర్శలు ఎలా ఉన్నా, ఏలూరులో వాస్తవ పరిస్థితి గురించి ఏంటో చూద్దాం.
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడి ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య బుధవారానికి బాగా తగ్గింది. మధ్యాహ్నం వరకు 18 మంది మూర్ఛ, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ 18 మందితో కలిసి ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 587కు చేరింది. వీరిలో 511 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు.
ఏలూరు జిల్లా ఆస్పత్రిలో 43 మంది చికిత్స పొందుతుండగా, మెరుగైన వైద్యం కోసం 33 మందిని విజయవాడ తరలించారు. ఏలూరులో అన్ని సచివాలయాల్లో 60కి పైగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక లక్షణాలున్న బాధితులు, వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి అక్కడి వైద్య శిబిరాల్లోనే చికిత్స అందిస్తున్నారు.
ప్రతిపక్షాల బాధల్లా వ్యాధి తీవ్రత ఎక్కడ తగ్గుముఖం పడుతుందో అన్నట్టుగా, వాళ్ల విమర్శల తీరు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడే ఘాటైన విమర్శలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ప్రతిపక్షాల తీరు విమర్శలకు అవకాశం ఇస్తోంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విమర్శిస్తున్నట్టు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ….511 మంది ఎలా కోలుకుంటారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిద్దరిపై ఉంది.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ బాధ రోగులు త్వరగా కోలుకుంటున్నందుకా? ఏలూరులో యుద్ధ ప్రాతిపదికన చర్యలు లేవంటున్న చంద్రబాబు తానేం కోరుకుంటున్నారు? ప‌్రభుత్వం ఏం చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో సూచనలు, సలహాలు ఇవ్వకుండా కేవలం విమర్శలేనా? ఇదేనా బాధ్యత గల ప్రతిపక్ష నేతగా నడుచుకోవాల్సిన తీరు? …ఇప్పుడివే సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.
ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే గత ఐదేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలపై ఏనాడైనా ఒక్క మాటైనా మాట్లాడారా? అప్పట్లో తాను మద్దతు ఇచ్చిన పార్టీలే కదా పాలించిందనే విషయాన్ని పవన్ మరిచిపోతే ఎలా? కానీ ఒక్కటైతే నిజం.
ఏలూరులో ఒక అంతుచిక్కని వ్యాధి ప్రబలి అక్కడి ప్రజలు హాహాకారాలు చేస్తుంటే, ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాత్రం జగన్‌ను టార్గెట్ చేసి మాట్లాడ్డాన్ని చూస్తే … వారి లక్ష్యం ఏంటో అంతుచిక్కింది. ప్రజల యోగక్షేమాల కంటే అధికారమే వారికి ప్రధాన లక్ష్యమనే వాస్తవం వెల్లడైంది.
ఈ అంతుచిక్కని వ్యాధి వారిద్దరి రాజకీయం ఎజెండా ఏంటో జనానికి అంతుచిక్కేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.