టీడీపీ అధినేత చంద్రబాబు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటికాలిపై లేస్తారని అందరికీ తెలుసు. అసలు సోము వీర్రాజు ఎజెండానే టీడీపీని, చంద్రబాబు ఉనికి లేకుండా చేయడమే.
అప్పుడు మాత్రమే ఏపీలో తమ పార్టీ బలపడుతుందని బీజేపీ పెద్దలతో పాటు సోము వీర్రాజు గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగా సోము వీర్రాజుకు ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించింది.
అధిష్టానం అంచనాలకు తగ్గట్టే బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి చంద్రబాబుపై సోము వీర్రాజు విరుచుకుపడుతున్నారు. దీంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఎలాగైనా బీజేపీకి దగ్గర కావాలనే ఉద్దేశంతో నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపినా , ప్రయోజనం లేకుండా పోయింది. వ్రతం చెడినా ఫలితం దక్కకపోవడంతో బాబుకు బీజేపీ వైఖరి అసలు నచ్చడం లేదు.
అలాగని ఆ పార్టీపై నోరు తెరిచి విమర్శించే దమ్ముధైర్యం బాబులో కరువయ్యాయి. ఇదే అవకాశంగా తీసుకున్న బీజేపీ నేతలు మరింత రెచ్చిపోయి చంద్రబాబు, టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా చంద్రబాబుపై సోము వీర్రాజు ఘాటు విమర్శలు చేశారు. చివరికి కేంద్రం ఇచ్చిన బాత్రూం నిధుల్ని కూడా చంద్రబాబు దోచుకున్నారని సోము వీర్రాజు విమర్శించారు.
అనంతపురంలో బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో, హిందూపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం రూ.40 వేల కోట్లు కేటాయిస్తే ఆయన ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. పైగా ఎన్ఆర్ఈజీఎస్ కింద హౌసింగ్ బాత్రూమ్ల నిధులు కూడా దోచేశాడని సోము వీర్రాజు అన్నారు.
కేంద్రం తెస్తున్న వ్యవసాయ చట్టాలు అద్భుతమైనవన్నారు. ఇవి రైతులకు మేలు చేసేవే తప్ప కీడు చేసేవి కావన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలన్నదే తమ డిమాండ్ అని మరోసారి స్పష్టం చేశారు.
కాగా బాత్రూం నిధులు కూడా దోచేశాడని సోము వీర్రాజు విమర్శించడంపై …చంద్రబాబు మరీ అంత చీఫ్ క్యారెక్టరా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.