మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దీటైన వాదనలు వినిపిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై హైకోర్టు రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.
పిటిషనర్ల తరపు వాదనలను ధర్మాసనం వినింది. ఇప్పుడు ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం రెండోరోజు తన వాదనలు కొనసాగించారు.
కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల ఏర్పాటు నిర్ణయం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయన్నారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం తగదన్నారు. ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని ఆపే దిశగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కలసి రాజధానిగా అమరావతిని నిర్ణయించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నారాయణ కమిటీలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, అధికారులు తప్ప.. నిపుణులు లేని విషయాన్ని బలంగా ధర్మాసనానికి వివరించారు.
అప్పట్లో కేంద్రప్రభుత్వం నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిందని, గత ప్రభుత్వం చట్టబద్ధ కమిటీ ఇచ్చిన నివేదికను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా తనకిష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుందని వివరించారు.
అసలు శివరామకృష్ణన్ కమిటీ నివేదికివ్వడానికి ముందే.. అమరావతిని రాజధానిగా చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వాదించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమన్నారు. రాజధాని ఎంపికలో కేంద్రానికి ఎలాంటి సంబంధం, పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఏర్పాటైన రాజధానుల విషయంలో కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే అది రాష్ట్రాల హక్కులను లాక్కోవడమే అవుతుందని కుండబద్దలు కొట్టినట్టు దుష్యంత్ దవే తేల్చి చెప్పారు.
గుంటూరు–కృష్ణా జిల్లాల మధ్య రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పినా, బేఖాతరు చేస్తూ గత ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థం కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. ఇదే సందర్భంలో ఏజీ శ్రీరామ్ అసలు అమరావతి నిర్ణయం ఎలా జరిగిందో, ఎవరెవరి పాత్ర ఏంటో ఈ కోర్టు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు.