తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించిన కొంత విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ కు అమ్మేశారు. అందుకు గానూ ఫ్యూచర్ రీటెయిల్ షేర్స్ లో 3.65 వాటా హెరిటేజ్ ఫుడ్స్ యాజమాన్యానికి దక్కాయి.
హెరిటేజ్ ఫుడ్స్ లో భాగంగా ఉండిన రీటెయిల్ స్టోర్లను ఫ్యూచర్ గ్రూప్ కు అప్పగించేసినందుకు ప్రతిగా ఫ్యూచర్ రీటెయిల్ లో 3 శాతానికి మించిన షేర్లు హెరిటేజ్ ఫుడ్స్ కు దక్కినట్టుగా ఉన్నాయి. ఈ డీల్ పూర్తి లోతుపాతులు ఏమిటో కానీ.. ఆ మూడు శాతానికి మించిన వాటాలను తాజాగా అమ్మేసుకుందట హెరిటేజ్ ఫుడ్స్.
ఫ్యూచర్ గ్రూప్ లో తమకుండిన షేర్లను ఓపెన్ మార్కెట్ లో అమ్మకానికి ఉంచి, క్యాష్ చేసుకుందట హెరిటేజ్ ఫుడ్స్. ఈ హెరిటేజ్ ఫుడ్స్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి కుటుంబానిది అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఫ్యూచర్ రీటెయిల్ లో హెరిటేజ్ ఫుడ్స్ తన షేర్లను అమ్మేసుకోవడం ద్వారా భారీ మొత్తాన్నే గడించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సుమారు 130 కోట్ల రూపాయలపై ధరకే ఆ షేర్ల అమ్మకం జరిగిందని సమాచారం.
తమ రీటెయిల్ విభాగాన్ని ఫ్యూచర్ కు విక్రయించి, అందుకు ప్రతిగా దక్కిన షేర్లను ఇప్పుడు అమ్మడం ద్వారా మొత్తం 132 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకుందట హెరిటేజ్. ఈ నిధుల ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ తమ దీర్ఘకాలిక రుణాలను తీర్చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.
కరోనా కాలంలో రీటెయిల్ స్టోర్లు అన్నీ నెలల పాటు మూతపడిన పరిస్థితుల్లో ఫ్యూచర్ రీటెయిల్ గ్రూప్ కూడా భారీగా నష్టపోయింది. తమకు ఏడు వేల కోట్ల రూపాయల వరకూ ఆదాయం తగ్గిపోయిందని ఆ సంస్థ ప్రకటించుకుంది. ఈ పరిస్థితుల్లో ఫ్యూచర్ గ్రూప్ కొన్ని విభాగాలను రిలయన్స్ కు అమ్ముతోంది. ఇంతలోనే ఇప్పుడు హెరిటేజ్ గ్రూప్ ఫ్యూచర్ లోని తమ షేర్లను అమ్మేసుకుని బయటకు వచ్చినట్టుంది.