సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయినా అలా గడిచిందో లేదో.. ఎన్నికలు, ఎన్నికలు అంటూ పదే పదే మాట్లాడుతున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం చిత్తు చిత్తు అయిన సంగతి వేరే చెప్పనక్కర్లేదు.
కేవలం 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యింది టీడీపీ. అందులోనూ ఆ ఎన్నికల్లో స్వయంగా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. అంత చేదైన అనుభవాలు ఎదురయ్యాయి తెలుగుదేశం పార్టీకి. అయినా చంద్రబాబు నాయుడు ఇంతలోనే ఎన్నికలు ఎన్నికలు అంటూ తెగ ఆరాటపడుతూ ఉండటం గమనార్హం.
ఇది తొలి సారి కాదు.. తన పార్టీ వాళ్లతో ఇప్పటి వరకూ డైరెక్టుగా ఒక్క సభ కానీ, ఒక సమావేశం కానీ నిర్వహించని చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగుల ద్వారా ఎన్నికలకు రెడీగా ఉండాలని మాత్రం పదే పదే చెబుతున్నారు. తాజాగా మరోసారి ఆయన ఆ పిలుపును ఇవ్వడం గమనార్హం!
2022లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకు పదే పదే చెబుతున్నట్టుగా ఉన్నారు. లెక్క ప్రకారం అయితే 2024లో కానీ ఎన్నికలు జరగవు. మోడీ ముందస్తు ఎన్నికలు తెస్తాడని చంద్రబాబు పాట పాడుతున్నట్టున్నారు. ఇటీవలే మోడీ మరోసారి ఈ విషయంపై స్పందించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ మోడీ నినాదమిచ్చారు. ఆ నినాదం సంగతి అలా ఉంచితే.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నికలు జరిగిపోతూ ఉన్నాయి.
ఇటీవలే బిహార్ ఎన్నికలు జరిగాయి, వచ్చే ఏడాది తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల ఎన్నికలకు యథాతథంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నికలు వాటి సమయాలకు తగ్గట్టుగా జరిగిపోతూ ఉన్న నేపథ్యంలో జమిలి ఎన్నికలు ఎలా సాధ్యం? అనేది ప్రశ్నార్థకం! నినాదాన్ని ఇస్తున్న మోడీ కూడా ఈ విషయంలో స్పందించడం లేదు.
అలాగే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది ఎలా సాధ్యం అవుతుందనేది కూడా అంతుబట్టని అంశం. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనాలంటే.. ఒకే ఫలితం కూడా రావాలి! దేశంలోని బోలెడన్ని రాష్ట్రాల్లో హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూలిపోవడం జరుగుతూ ఉంటుంది. గత ఐదారేళ్ల కాలంలో అనేక చోట్ల బీజేపీ వాళ్లే ప్రభుత్వాలను కూల్చారు. ప్రతిసారీ సక్సెస్ ఫుల్ గా ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి కూడా సాధ్యం కాకపోవచ్చు.
కొన్ని చోట్ల అలా ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియలో మధ్యంతర ఎన్నికలు జరగాల్సి రావొచ్చు. మరి అలాంటప్పుడు దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యం అవుతుంది? అలాగే అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని రాజ్యాంగం ముఖ్యమంత్రులకు ఇచ్చింది. ముఖ్యమంత్రి హోదాలోని వారు తమకు సభపై విశ్వాసం లేనప్పుడో, తమ రాజకీయ ప్రణాళికలకు అనుసరించో.. తమకున్న మెజారిటీతో సభను, తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళుతూ ఉంటారు.
అదంతా రాజ్యాంగ ప్రకరమే జరుగుతుంది. మరి జమిలి ఎన్నికలంటున్న మోడీ రాష్ట్రాల్లో అధికార పక్షాలకు ఆ హక్కును రద్దు చేయాల్సి ఉంటుందేమో! దానికి రాజ్యాంగ సవరణ అవసరం కావొచ్చు.
రాష్ట్ర ప్రభుత్వాల హక్కును హరించే ఆ సవరణకు బీజేపీ యేతర పాలనలోని రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటాయి? ఎలా ఒప్పుకుంటాయి? ఇప్పుడంటే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సరే, మరో ఐదేళ్లకో పదేళ్లకో అధికారం కోల్పోతే.. అప్పుడు ఈ జమిలి ఎన్నికల ప్రక్రియ మరొకరికి వరంగా మారొచ్చు! ఈ అంశం లోతుల్లోకి వెళితే.. బోలెడన్ని చిక్కుముడులు కనిపిస్తాయి.
వాటి గురించి మోడీ కూడా ఇంకా పూర్తిగా స్పందించలేదు. అయితే చంద్రబాబు మాత్రం అవిగో ఎన్నికలు, ఇవిగో ఎన్నికలు అంటున్నారు.