చంద్రబాబు అరెస్టుకు మరో మూడునెలలే గడువు!

చంద్రబాబు నాయుడు నేడో రేపో అరెస్టు కాక తప్పదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పనే చెప్పారు. అయితే ప్రస్తుత పరిణామాలను, సుప్రీం కోర్టు తీర్పును గమనిస్తున్న వారు మాత్రం.. చంద్రబాబు అరెస్టుకు…

చంద్రబాబు నాయుడు నేడో రేపో అరెస్టు కాక తప్పదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పనే చెప్పారు. అయితే ప్రస్తుత పరిణామాలను, సుప్రీం కోర్టు తీర్పును గమనిస్తున్న వారు మాత్రం.. చంద్రబాబు అరెస్టుకు మరో మూడు నెలలు మాత్రమే గడువు మిగిలిఉందని భావిస్తున్నారు. ఈ సంగతి చంద్రబాబునాయుడుకు కూడా బాగా అర్థమైందని, అందుకే ఆయన అనవసరమైన పూనకం తెచ్చుకుని ఊగిపోతూ రంకెలు వేస్తున్నారని కూడా ప్రజలు భావిస్తున్నారు. 

హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టేసిన సుప్రీం కోర్టు, అప్పట్లో కేసు అపరిపక్వ దశలో ఉన్నదని, ఇప్పుడు మూడునెలల్లోగా ఆ పిటిషన్ ను విచారించి హైకోర్టు తీర్పు చెప్పాలని నిర్దేశించింది. ఆ గడువు పూర్తయ్యే సమయానికి చంద్రబాబు అరెస్టుకు అన్ని రకాలుగానూ లైన్ క్లియర్ అవుతుందనేది ప్రజల అభిప్రాయంగా ఉంది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారి పాలించే అవకాశం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల అవినీతికి పాల్పడింది. అడ్డగోలుగా స్వాహాలతో పాటు, రాజధాని ప్రాంతంలో  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి అయినవాళ్లకు కోట్లాది రూపాయల లబ్ధి చేకూర్చే వ్యవహారాలకు తెగబడింది. ఈ మొత్తం గత ప్రభుత్వ పాలన బాగోతాలపై విచారణ జరిపించేందుకు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంది. 

మొత్తం అవినీతి ఆరోపణలను విచారించేందుకు ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో పాటు, ఒక సిట్ ను కూడా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం రెండు జీవోలు విడుదల చేసింది. తన మీద ఎన్ని రకాల నేరారోపణలు ఉన్నప్పటికీ కోర్టు ద్వారా కవచాలను సృష్టించుకునే అలవాటు ఉన్న చంద్రబాబునాయుడు, ఈ జీవోలపై కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే మీద రాష్ట్రప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేసింది. తాజాగా సుప్రీం ఆ స్టేను కొట్టివేయడం విశేషం. 

సుప్రీం అంతటితో ఆగలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సమీక్షించాలని కొత్త ప్రభుత్వం అనుకోవడం అసంజసం ఏమీ కాదంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. కేసు ఇంకా అపరిపక్వదశలో ఉండగానే హైకోర్టు స్టే ఇచ్చేసిందని, కేసులోని మెరిట్స్ ను పూర్తిగా పరిశీలించి, రాష్ట్రప్రభుత్వం కోరుతున్నట్లుగా కేంద్రప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చి విచారించిన మూడు నెలల్లోగా ఆ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. ఈ నేపథ్యంలో స్టే రద్దయింది. మళ్లీ విచారించడంలో హైకోర్టు మరోసారి స్టే ఇచ్చే అవకాశాలు తక్కువ. 

తెలుగుదేశం వేసిన పిటిషన్ ను కొట్టేసినట్లయితే గనుక.. కేబినెట్ సబ్ కమిటీ, సిట్ విచారణ కార్యాచరణ మొదలు పెడతాయి. న్యాయపరమైన చిక్కులు లేకుండా విచారణ జరిగితే.. చాలా స్వల్పవ్యవధిలోనే చంద్రబాబునాయుడు అరెస్టు జరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.