సీబీఐ లాజిక్ చిత్రంగా కనిపిస్తోందే..!

‘‘వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ‘కస్టడీలోకి తీసుకుని మాత్రమే’ విచారించాల్సిన అవసరం చాలా ఉంది! కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయండి.’’  అనేది సీబీఐ వారి తాజా వాదన. ఈ మేరకు తెలంగాణ…

‘‘వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ‘కస్టడీలోకి తీసుకుని మాత్రమే’ విచారించాల్సిన అవసరం చాలా ఉంది! కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయండి.’’  అనేది సీబీఐ వారి తాజా వాదన. ఈ మేరకు తెలంగాణ హైకోర్టును సీబీఐ అభ్యర్థించింది. ఈ సందర్భంగా వారి వాదనలను ప్రస్తావించుకోవడం అనవసరం. 

ఎందుకంటే.. అదంతా ‘పాడిందే పాడరా పాచిపళ్లతో..’ అన్న సామెత చందంగా ఉంటుంది. అవినాష్ రెడ్డి ని కేసులో పూర్తిగా ఇరికించడానికి కొన్ని నెలలుగా ఏయే మాటలు చెబుతున్నారో, అవన్నీ మళ్లీ తాజా పిటిషన్లో కూడా చెప్పారు. అయితే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణకే కావాలని సీబీఐ అడగడం వెనుక లాజిక్ చిత్రంగా, తమాషాగా కనిపిస్తోంది.

ముందస్తు బెయిల్ పిటిషన్ ను అనుమతించిన సందర్భంలోనే, సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి సూచించింది. అప్పటినుంచి ఆయన ప్రతిరోజూ విచారణకు పిలిచినా కూడా హాజరయ్యారు. ప్రతిరోజూ అనేక గంటలపాటు విచారించినా కూడా సీబీఐకు సహకరించారు. అయితే ఆయన సీబీఐ విచారణకు సహకరించడం లేదని, కస్టడీకి తీసుకుని విచారించాలి గనుక ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తే తాము అరెస్టు చేసుకుంటాం అని సీబీఐ పేర్కొంటోంది. 

ఇక్కడ ప్రజలకు ఒక సందేహం కలుగుతోంది. కస్టోడియల్ విచారణకు- మామూలు విచారణకు సీబీఐ వద్ద చాలా పెద్ద తేడా ఏమైనా ఉంటుందా? మామూలు విచారణలో రాబట్టలేని విషయాలన్నీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఇట్టే కక్కించేయగలమని సీబీఐ అధికారులు భావిస్తున్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.

సీబీఐ ఏ రకంగా విచారించినా సరే.. అవినాష్ రెడ్డి తనకు తెలిసిన విషయాలు, లేదా తాను చెప్పదలచుకున్న విషయాలు చెబుతారే తప్ప.. సీబీఐ కోరుకుంటున్న విషయాలు చెప్పడం జరగదు కదా.. అనేది కూడా ప్రజల సందేహం. సీబీఐ తీరు చూస్తే.. కోర్టుకు చెబుతున్న మాటల్లో అవినాష్ రెడ్డి మీద వారు ఏయే నిందలైతే వేస్తున్నారో.. వాటన్నింటినీ ఒప్పుకుంటే తప్ప విచారణకు సహకరించినట్టుగా వారికి అనిపించదేమోనని ప్రజలు అంటున్నారు. 

సీబీఐ ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిగంటలు విచారించినా అవినాష్ సహకరిస్తుండగా.. అరెస్టు గురించి అంతగా పట్టుబట్టాల్సిన అవసరమేమిటి? కస్టోడియల్ విచారణ అంటే అది యింకో రకంగా ఉంటుందా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

కస్టడీకి తీసుకుని విచారించి తెలుసుకోవాల్సిన విషయాలుగా సీబీఐ పేర్కొంటున్న అనేక అంశాలను ఇన్నాళ్లూ జరిగిన విచారణలో అసలు అడగనే లేదా? అడిగితే అవినాష్ రెడ్డి ఎలాంటి సమాధానాలు చెప్పారు? అసలేమీ చెప్పలేదా? ఆ సమాధానాలతో సీబీఐ సంతృప్తి చెందలేదా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.