ప‌రామ‌ర్శించ‌డానికి టైమ్ లేదా జ‌గ‌న్‌?

వేస‌విలో అకాల వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో అపార పంట న‌ష్టం జ‌రిగింది. పంట‌లు చేతికొచ్చిన స‌మ‌యంలో అకాల వ‌ర్షాలు కుర‌వ‌డంతో భారీ న‌ష్టం సంభ‌వించింది. మ‌రోవైపు తుపాను హెచ్చ‌రిక‌లు మ‌రింత‌గా భ‌య‌పెడుతున్నాయి.…

వేస‌విలో అకాల వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో అపార పంట న‌ష్టం జ‌రిగింది. పంట‌లు చేతికొచ్చిన స‌మ‌యంలో అకాల వ‌ర్షాలు కుర‌వ‌డంతో భారీ న‌ష్టం సంభ‌వించింది. మ‌రోవైపు తుపాను హెచ్చ‌రిక‌లు మ‌రింత‌గా భ‌య‌పెడుతున్నాయి. క్షేత్ర‌స్థాయిలో రైతాంగం పంట‌లు న‌ష్ట‌పోయి అల్లాడుతుంటే… సీఎం వైఎస్ జ‌గ‌న్ మాత్రం స‌మీక్ష‌ల‌కే ప‌రిమితం కావ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

క్షేత్ర‌స్థాయిలో న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను ప‌రిశీలించి, బాధిత రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చిన ఇబ్బంది ఏంట‌నే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడు గురు, శుక్ర‌వారాల్లో ప‌ర్య‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

అకాల వ‌ర్షాలు, పంట న‌ష్టంపై సీఎంవో అధికారుల‌తో క‌లిసి సీఎం జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌తో టెలికాన్ఫ‌రెన్స్ వ‌ర‌కే ప‌రిమితం అయ్యారు. అకాల వ‌ర్షాల కార‌ణంగా త‌డిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌ ఆదేశించారు. మ‌రోవైపు హార్వెస్టింగ్ చేసి వున్న ధాన్యం ఎక్క‌డున్నా వ‌ర్షం బారి నుంచి కాపాడేందుకు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పంట న‌ష్ట ప‌రిహారంపై ఏపీ స‌ర్కార్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

అకాల వ‌ర్షాల కార‌ణంగా లక్షలాది ఎకరాల్లో పంట‌లు నీటిపాల‌య్యాయి. రూ.కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్న‌ట్టు స‌మాచారం. కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి. అలాగే కల్లాల్లో ధాన్యం  తడిసి ముద్దయ్యింది. మామిడి, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల వ‌డ్లు త‌డిసిపోయి మొలక‌లొస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో మొక్క‌జొన్న‌, ప‌సుపు, మిర్చి పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లింది. ఒక‌వైపు పంట‌లు న‌ష్ట‌పోయి రైతులు అల్లాడిపోతుంటే, సీఎం జ‌గ‌న్ ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌క‌పోవ‌డం ఏంట‌నే నిల‌దీత ఎదుర‌వుతోంది.

రైతులు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ప‌రామ‌ర్శించ‌కుండా ఇంటికే ప‌రిమితం కావ‌డంపై వైసీపీ శ్రేణులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.  

ఏలూరు జిల్లా పరిధిలోని ఉంగుటూరు నియోజకవర్గంలో, కాకినాడ జిల్లాలోని రామచంద్రాపురంలో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను గురువారం చంద్ర‌బాబు ప‌రిశీలించి, అనంత‌రం రైతులను  పరామర్శిస్తారు. శుక్రవారం ఉదయం రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తారు. 

సీఎం జ‌గ‌న్ మాత్రం ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌ల‌కు ప‌రిమిత‌మై, బాధ్య‌త తీరిపోయింద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. త‌న‌ది రైతుల ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వంగా చెప్పుకోవ‌డం కాదు, ఆచ‌రించిన‌ప్పుడే ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని సీఎం గ్ర‌హిస్తే మంచిది.