వైసీపీ మౌన‌మునిని ఉద్దేశించే…ఆ మాట‌!

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి పూర్తిగా మౌన‌మునిగా మారిపోయారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముంగిట ఈ మౌనం వైసీపీకి లాభ‌మో, న‌ష్ట‌మో విజ‌య‌సాయిరెడ్డి నిర్ణ‌యించుకోవాల్సిన విష‌యం. త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే విజ‌య‌సాయిరెడ్డి…

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి పూర్తిగా మౌన‌మునిగా మారిపోయారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముంగిట ఈ మౌనం వైసీపీకి లాభ‌మో, న‌ష్ట‌మో విజ‌య‌సాయిరెడ్డి నిర్ణ‌యించుకోవాల్సిన విష‌యం. త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే విజ‌య‌సాయిరెడ్డి అల‌క‌బూనార‌నే టాక్ వినిపిస్తోంది. గ‌తంలో ఆయ‌న ప్ర‌తిదానికి విప‌రీత ధోర‌ణిలో స్పందించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా న‌డుచుకోవ‌డం వైసీపీ శ్రేణుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

వైసీపీలో కీల‌క నాయ‌కుడైన విజ‌య‌సాయిరెడ్డి వైఖ‌రిని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. అయితే ఆయ‌న మౌనాన్ని టీడీపీ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటోంది. ఇటీవ‌ల టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ‌కీయ మార్పు సంకేతాల్ని గ‌మ‌నించే భ‌యంతో విజ‌య‌సాయిరెడ్డి మారార‌ని అన్నారు. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి మౌనంపై ఆయ‌న అన్న స‌మానుడైన చంద్ర‌బాబునాయుడు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంలో చంద్ర‌బాబునాయుడు మీడియా స‌మావేశంలో ఏమ‌న్నారంటే… “ఓడిపోతామ‌ని వైసీపీ వాళ్ల‌లో కంప‌రం పుట్టిపోయింది. కొంద‌రు కాడి ప‌డేశారు. కొంద‌రు పోటీ చేయ‌బోమంటారు. కొంద‌రు రీజన‌ల్ కోఆర్డినేట‌ర్ ప‌ద‌వి వ‌ద్దంటున్నారు. ఎందుకు మీకు భ‌యం?” అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

కాడి ప‌డేశార‌ని విజ‌య‌సాయిరెడ్డిని ఉద్దేశించి అన్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని తాను పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించ‌డాన్ని చంద్ర‌బాబు ప‌రోక్షంగా గుర్తు చేశారు. ఇటీవ‌ల రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన మరో మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డిపై బాబు ప‌రోక్షంగా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. వీళ్లంతా కేవ‌లం ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతోనే ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

విజయ‌సాయిరెడ్డి మౌనాన్ని టీడీపీ ఆ ర‌కంగా క్యాష్ చేసుకుంటోంది. వైసీపీలో త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌న‌ప్పుడు, టీడీపీతో వ్య‌క్తిగ‌త శ‌త్రువు పెట్టుకోవ‌డం ఎందుక‌నే విజ‌య‌సాయిరెడ్డి ఆలోచ‌న‌ను త‌ప్పు ప‌ట్ట‌లేం. వైపీసీలో ఎప్పుడు, ఎవ‌రికి ఎలాంటి ప‌ద‌వులు వ‌స్తాయో, ఊడుతాయో అంతుచిక్క‌ని ర‌హ‌స్యం. అందుకే ఆ పార్టీలో ప‌ద‌వులు మూణ్నాళ్ల ముచ్చ‌ట అనే అభిప్రాయం బ‌లంగా వుంది. 

రెండున్న‌రేళ్ల‌కే మంత్రి ప‌ద‌వులు పోగొట్టుకున్న వాళ్ల‌ను మ‌నం చూస్తున్నాం. కార‌ణాలేవైనా వైసీపీలో ముఖ్య నేత‌ల అస్త్ర‌స‌న్యాసంపై టీడీపీ త‌మ‌దైన రీతిలో జ‌గ‌న్ విప‌రీత ధోర‌ణే కార‌ణ‌మ‌నే రీతిలో నెగెటివిటీని సృష్టించే య‌త్నం చేస్తోంది. రాజ‌కీయం అంటే ఇదే క‌దా!