చేయి చేసుకున్న హోంమంత్రి!

అధికార మ‌త్తులో త‌న గ‌న్‌మన్ అయిన కానిస్టేబుల్‌పై తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హోంమంత్రి వైఖ‌రిని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఏకిపారేస్తున్నారు.…

అధికార మ‌త్తులో త‌న గ‌న్‌మన్ అయిన కానిస్టేబుల్‌పై తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హోంమంత్రి వైఖ‌రిని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఏకిపారేస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ది ఇవాళ పుట్టిన రోజు.  అమీర్‌పేట‌లోని డీకే రోడ్డులోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన అనంత‌రం మంత్రి త‌లసానిని హోంమంత్రి ఆలింగ‌నం చేసుకుని శుభాకాంక్ష‌లు చెప్పారు. అనంత‌రం బొకే ఎక్క‌డ అంటూ త‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు, గ‌న్‌మన్ అయిన కానిస్టేబుల్‌ను మ‌హ‌మూద్ అలీ ఆరా తీశారు. త‌న‌కు తెలియ‌ద‌ని అత‌ను స‌మాధానం ఇచ్చారు.

దీంతో స‌హ‌నం కోల్పోయిన అలీ గ‌న్‌మ‌న్ చెంప చెళ్లుమ‌నిపించారు. ఈ దెబ్బ‌కు గ‌న్‌మ‌న్ షాక్‌కు గుర‌య్యారు. త‌న‌ను కొట్టిన అలీ వైపు అత‌ను చూస్తుండిపోయారు. ఈ లోపు అత‌ని ప‌క్క‌నున్న వాళ్లు బొకే అందించారు. ఇదిలా వుండ‌గా హోంమంత్రికి మంత్రి త‌ల‌సాని స‌ర్ది చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

హోంమంత్రిని అనే అహంకారంతో అలీ దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కానిస్టేబుల్‌ను కొట్టే హ‌క్కు ఎవ‌రిచ్చార‌ని నిల‌దీస్తున్నారు. వెంట‌నే హోంమంత్రి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నే డిమాండ్లు పౌర స‌మాజం నుంచి వ‌స్తున్నాయి.