క్యారెక్టర్ పేరు శివ.. సినిమా పేరు మాత్రం కస్టడీ

నాగచైతన్య అప్ కమింగ్ మూవీ కస్టడీ. ఇందులో కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించబోతున్నాడు చైతూ. అలాంటప్పుడు సినిమాకు శివ అనే టైటిల్ పెట్టొచ్చు కదా. ఎలాగూ తండ్రి నటించిన పాథ్ బ్రేకింగ్ మూవీ శివ…

నాగచైతన్య అప్ కమింగ్ మూవీ కస్టడీ. ఇందులో కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించబోతున్నాడు చైతూ. అలాంటప్పుడు సినిమాకు శివ అనే టైటిల్ పెట్టొచ్చు కదా. ఎలాగూ తండ్రి నటించిన పాథ్ బ్రేకింగ్ మూవీ శివ సినిమా ఉంది కాబట్టి, ఆ టైటిల్ పెడితే కస్టడీ సినిమాకు మరింత మైలేజీ వచ్చేది కదా?

“కస్టడీ సినిమాలో నా పాత్ర పేరు శివ. సెంటిమెంట్ కోసం ఆ పేరు పెట్టలేదు. శివ అనే పేరు వెనక చాలా పవర్ ఉంది. కస్టడీలో శివ పాత్ర వెనక కూడా అలాంటి లేయర్స్ ఉన్నాయి. అందుకే ఆ పేరు పెట్టాం. శివ సినిమాకు కస్టడీకి ఎలాంటి సంబంధం లేదు. అందుకే శివ అనే టైటిల్ పెట్టలేదు. కేవలం జిమ్మిక్ కోసం ఓ సూపర్ హిట్ టైటిల్ ను వాడకూడదు. ఒరిజినల్ ను ఒరిజినల్ గానే ఉంచుదాం.”

ఇలా శివ అనే టైటిల్ ఎందుకు పెట్టలేదో వివరించాడు నాగచైతన్య. శివ సినిమాపై అక్కినేని అభిమానులకు చాలా గౌరవం ఉందని, తనకు కూడా ఆ సినిమాపై చాలా రెస్పెక్ట్ ఉందని, అలాంటి సినిమా టైటిల్ ను వాడకపోవడమే బెటరని అభిప్రాయపడ్డాడు చైతూ.

ఈ సందర్భంగా కస్టడీ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటపెట్టాడు నాగచైతన్య. ఏ సినిమాలోనైనా హీరో చేతిలో విలన్ ఛస్తాడు. కానీ కస్టడీ సినిమాలో మాత్రం విలన్ ను హీరో చంపడు. చంపే సందర్భాలు వచ్చినప్పటికీ, విలన్ బతికుండేలా చేస్తాడు. అదే కస్టడీ సినిమాలో కొత్త పాయింట్ అంటున్నాడు నాగచైతన్య.