గద్దర్: వయసుడిగిపోయిన తర్వాత..

ప్రజాయుద్ధ నౌకగా ఆయనను అభిమానులు కీర్తించినదంతా గతం! ఆ పోరాట యోధుడి ప్రాభవం ఇప్పుడు గతించిన ఎపిసోడ్! సిద్ధాంతాలు మాట్లాడే భారతీయ జనతా పార్టీకూడా క్రియాశీల రాజకీయాలకు రిటైర్మెంటు వయసుగా 75ను పరిగణిస్తున్న వేళ..…

ప్రజాయుద్ధ నౌకగా ఆయనను అభిమానులు కీర్తించినదంతా గతం! ఆ పోరాట యోధుడి ప్రాభవం ఇప్పుడు గతించిన ఎపిసోడ్! సిద్ధాంతాలు మాట్లాడే భారతీయ జనతా పార్టీకూడా క్రియాశీల రాజకీయాలకు రిటైర్మెంటు వయసుగా 75ను పరిగణిస్తున్న వేళ.. 76 ఏళ్ల గద్దర్ ఇప్పుడు మొదటి సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా అని అంటున్నారు. 

గజ్వేల్ నియోజకవర్గంలో ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీదనే తొడకొట్టడానికి గద్దర్ సిద్ధం అవుతున్నారు. కేసీఆర్ పట్ల ద్వేషభావమూ, వ్యతిరేకతా ఉండవచ్చు గాక.. కనీసం నిజం మాట్లాడే ధైర్యం కూడా లేని వేళ ఆయన ఎందుకింత రాజకీయ పంతానికి పోతున్నారు?

గద్దర్ కు విప్లవగాయకుడిగా ఉన్న కీర్తి ప్రతిష్టలు చిన్నవి కాదు. ఆయన స్వరం నిప్పులు చెరుగుతున్న రోజుల్లో గద్దర్ సభ ఉన్నదంటే ఇరుగు పొరుగు ఊర్లనుంచి ప్రజలు కూడా బండ్లు కట్టుకుని మరీ సభలకు వచ్చిన సందర్భాలు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లలు. అలాంటి క్రేజ్ ఉన్న ప్రజాగాయకుడి ప్రభ క్రమంగా సన్నగిల్లుతూ వచ్చింది. ఆయన విప్లవభావజాలం సడలిపోతూ వచ్చింది. విప్లవోద్యమాలకు ఆయన దూరం అయ్యారు. 

తర్వాతి కాలంలో గద్దర్ కొడుకుతో సహా కాంగ్రెసు పార్టీలో చేరారు. కాంగ్రెసు పార్టీని విపరీతంగా కీర్తించారు. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఆ పార్టీలో చేరారనే అపప్రధను మూటగట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. పోరాట యోధులకు తగిన ఆదరణ, గౌరవం దక్కలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గద్దర్ తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటారు. కేసీఆర్ మీద ద్వేషం ఉండవచ్చు గాక, కానీ ఆచరణాత్మక దృక్పథంతో నిజాయితీగా వ్యవహరిస్తున్నారా? అంటే అది కూడా లేదు.

ఒకే సమయంలో అక్కడ ఢిల్లీలో పార్లమెంటు భవనమూ, ఇక్కడ హైదరాబాదులో సెక్రటేరియేట్ భవనమూ నిర్మాణం జరుగుతున్న వేళ.. గద్దర్ ఓ పనిచేశారు. బిజెపి నాయకులను కలిసి పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని వినతిపత్రాలు సమర్పించారు. ఆ వినతిపత్రాలను ప్రధాని మోడీకి పంపాలని కోరారు. 

రాష్ట్ర సెక్రటేరియేట్ కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఓ బహిరంగ డిమాండ్ మాత్రం చేశారు. కేసీఆర్ ను కలిసి విన్నవించే ప్రయత్నమూ చేయలేదు. కమలదళం.. గద్దర్ వినతుల్ని చెత్తబుట్టకు దఖలు పరచింది. గద్దర్ అడగడంతో సంబంధం లేకుండా కేసీఆర్ సెక్రటేరియేట్ కు అంబేద్కర్ పేరు పెట్టారు. గద్దర్ కనీసం కేసీఆర్ కు థాంక్స్ కూడా చెప్పలేదు. 

అలాంటి గద్దర్ కెఎ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఉపఎన్నికలో పోటీచేయడానికి సిద్ధమయ్యారు. ప్రపంచశాంతి కోసమే కెఎ పాల్ పార్టీలో చేరానంటూ ఆ సందర్భంగా ప్రకటించారు. ఆయన పోటీ గురించి చాలా హడావుడి జరిగింది గానీ.. చివరికి డీల్ ఎక్కడ చెడిందో తెలియదు. 

మునుగోడు బరిలో కెఎ పాల్ స్వయంగా పోటీచేశారు. వెయ్యికంటె తక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. అప్పుడు పోటీ మిస్సయిన గద్దర్.. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మీదకే కాలు దువ్వుతున్నారు. తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానన్న మాట నిజమే గానీ.. ఆయన ప్రజల్లో ఎంత విశ్వసనీయతను కాపాడుకుని ఉన్నారు అనేదే అనుమానం.